ఏసీబీకి చిక్కిన మండపేట తహసీల్దార్‌

21 Aug, 2018 13:03 IST|Sakshi
దాడి కేసు వివరాలను చెబుతున్న ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌ ,తహసీల్దార్‌ సీహెచ్‌ వెంకటలక్ష్మి

రైతు నుంచి లంచం డిమాండ్‌

రూ.30 వేలు తీసుకుంటుండగా పట్టివేత

తూర్పుగోదావరి , మండపేట: రైతు నుంచి రూ.30 వేలు తీసుకుంటూ మండపేట తహసీల్దార్‌ సీహెచ్‌ వెంకటలక్ష్మి సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమె ఆస్తులపైనా సోదాలు చేయనున్నట్టు తెలిపారు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్‌ కథనం ప్రకారం మండలంలోని కేశవరానికి చెందిన రైతు ఉండమట్ల సుబ్బారావు తండ్రి పేరిట ఉన్న 3.59 ఎకరాల భూమిని అన్నదమ్ములు పంచుకున్నారు. ఈ భూమిలో 60 సెంట్లను సుబ్బారావు, అతని తమ్ముడు చెరో 30 సెంట్ల చొప్పున పంచుకున్నారు. గత నెల 20న సుబ్బారావు పాస్‌బుక్‌ కోసం తమ్ముడు కుమారుడితో కలిసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేనుకున్నాడు. సర్వే నంబర్‌ తప్పుగా ఉందంటూ పాస్‌బుక్‌ మంజూరుకు తిరస్కరించారు.

గ్రామానికి చెందిన వీఆర్‌ఏ వీర్రాజు తహసీల్దార్‌ వెంకటలక్ష్మి కారు డ్రైవర్‌గా పనిచేస్తుండడంతో పాస్‌బుక్‌ ఇచ్చేలా చూడాలని సుబ్బారావు అతడిని కోరినట్టు డీఎస్పీ తెలిపారు. అయితే రూ.50 వేలు ఇస్తే పనైపోతుందని తహసీల్దార్‌ చెప్పినట్టుగా చెప్పాడు. చివరికి రూ.30 వేలకు బేరం కుదిరింది. దీంతో సుబ్బారావు ఈ నెల 17న రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సోమవారం రసాయనాలు పూసిన 15  రెండు వేల రూపాయల నోట్లను సుబ్బారావుకు అందజేశారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకటలక్ష్మికి అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుధాకర్, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని కూడా విచారిస్తున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వి.పుల్లారావు, సూర్యమోహనరావు, తిలక్, ఎస్సై నరేష్, ఎక్సైజ్‌ సీఐ మోహన్‌రావు  పాల్గొన్నారు.

విధుల్లో చేరిన రెండు నెలలకే..
రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో స్పెషల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటలక్ష్మి గత జూన్‌లో మండపేట తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో గ్రూపు–2 ద్వారా టీడీగా ఎంపికైన ఆమె కిర్లంపూడి, రాజమహేంద్రవరంలో 2013లో పదోన్నతిపై అంబాజీపేట, రంగంపేట, ఏలేశ్వరం తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

మరిన్ని వార్తలు