ఏసీబీ వలలో వీఆర్‌ఓ

2 Nov, 2018 13:11 IST|Sakshi
ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు

రూ.8వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

కర్నూలు, నంద్యాల: ఏసీబీ అధికారులకు అవినీతి చేప దొరికింది. శిరివెళ్లకు చెందిన వీఆర్‌ఓ తిరుపాల్‌ నంద్యాల పట్టణంలోని ఓ కూల్‌డ్రింక్‌ షాపులో ఈ పాసు పుస్తకం కోసం రూ.8వేలు లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శిరివెళ్ల మండల కేంద్రానికి చెందిన జాఫర్‌వలి అనే రైతు తన తమ్ముడుకు చెందిన 2.54ఎకరాల భూమికి ఈ పాసుపుస్తకం కావాలని వీఆర్‌ఓ తిరుపాల్‌ను సంప్రదించారు. ఈ పాపుపుస్తకం కావాలంటే రూ.10వేలు డబ్బులు ఇవ్వాలని వీఆర్‌ఓ రైతుకు తెలిపారు. తాము పేదవాళ్లమని, అన్ని రికార్డుల ప్రకారం డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినా డబ్బులు ఇవ్వనిదే పని కాదని వీఆర్‌ఓ తేల్చిచెప్పారు.

దీంతో ఏం చేయాలో దిక్కుతోచక రూ.10వేలు ఇచ్చుకోలేమని, రూ.8వేలు ఇస్తామని చెప్పగా వీఆర్‌ఓ అంగీకరించాడు. వీఆర్‌ఓ ఈ పాసుపుస్తకం కోసం డబ్బులు డిమాండ్‌ చేస్తున్న విçషయాన్ని రైతు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రైతు జాఫర్‌వలీ బుధవారం డబ్బులు తెచ్చామని, ఎక్కడ ఇవ్వాలని వీఆర్‌ఓకు ఫోన్‌ చేయగా తాను శిరివెళ్లలో లేనని, నంద్యాలలో ఉన్నానని, నంద్యాలకు వచ్చి ఫోన్‌ చేయమని తెలిపారు. రైతు నంద్యాలకు వచ్చి ఫోన్‌ చేయగా బస్టాండ్‌ వద్ద ఉన్న కూల్‌డ్రింక్‌ షాపులో ఉన్నానని, ఇక్కడికి రావాలని తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు మఫ్టీలో పంచలు కట్టుకొని కూల్‌డ్రింక్‌ షాపు వద్దకు చేరుకున్నారు. రైతు కూల్‌డ్రింక్‌ షాపులో ఉన్న వీఆర్‌ఓకు రూ.8వేలు నగదు ఇవ్వగానే రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఓల్ట్‌ టౌన్‌లోని వీఆర్‌ఓ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా రైతుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచిన ఈ పాసుపుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు.   వీఆర్‌ఓను అరెస్ట్‌ చేశామని, శుక్రవారం ఉదయం కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ సీఐ నాగభూషణం తెలిపారు. అవినీతి అధికారులపై ప్రజలు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు.  

మరిన్ని వార్తలు