ఆదాయం వేలల్లో.. కోట్లు ఎలా సంపాదించారు?

25 Jan, 2020 09:00 IST|Sakshi

చంద్రబాబు అక్రమాస్తుల నిగ్గు తేల్చేందుకు ఉత్తర్వులివ్వాలి

ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి తరఫు లాయర్‌ వాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసు పిటిషన్‌పై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. లక్ష్మీపార్వతి తరఫున సీనియర్‌ న్యాయవాది కోకా శ్రీనివాస్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ఆస్తుల వివరాల ఆధారంగానే తాము ఫిర్యాదు చేశామని కోర్టుకు తెలిపారు. రూ.వేలల్లో ఆదాయం ఉన్న చంద్రబాబు కొద్ది కాలానికే కోట్లకు ఎలా పడగెత్తారో వివరించలేదన్నారు. ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌ కూడా కట్నం ఇవ్వలేదని అధికారిక పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎన్నికల సమయంలో.. అసెంబ్లీకి ఇచ్చిన పత్రాల్లో ప్రస్తావించారు. 

ఎమ్మెల్యేగా, మంత్రిగా పొందిన జీతభత్యాలతోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడగట్టారో తేల్చాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్‌ కంపెనీ ఏర్పాటు చేశాక నెలకు రూ.20 వేలు చొప్పున ఐదు నెలలే తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాంటప్పుడు కోట్ల రూపాయల ఆస్తిని ఎలా ఆర్జించారో తేల్చేందుకు తగిన ఉత్తర్వులివ్వాలి’ అని కోర్టును కోరారు. అయితే సాంకేతిక కారణాల వల్ల నేటికీ ఈ కేసులో స్టే ఉన్నట్లు వెబ్‌సైట్‌లో ఉండటంతో పూర్తి వివరాలు తెలుసుకుని వచ్చే విచారణ సమయంలో చెప్పాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. 

కేసు నేపథ్యం ఇదీ.. : ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2005లో చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను సైతం వినాలని కోరారు. అయితే ఫిర్యాదును విచారణకు స్వీకరించడానికి ముందు దశలోనే వాదనలు వినడం సాధ్యంకాదని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై చంద్రబాబు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసి స్టే పొందారు.  సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్టే గడువు ముగిసింది. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు గతేడాది నవంబర్‌ 18న విచారణ ప్రారంభించింది.   

మరిన్ని వార్తలు