ఏసీబీ చేతికి దేవికారాణి ఐటీ వివరాలు 

13 Jan, 2020 02:55 IST|Sakshi

 ఇటీవల ఐటీకి లేఖ రాసిన ఏసీబీ అధికారులు 

సమగ్ర వివరణ ఇచ్చిన ఆదాయ పన్ను శాఖ

 ఏటా రూ.19 కోట్లు చెల్లించిన ఫార్మా ఎండీ శ్రీహరిబాబు

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మందుల కొనుగోళ్లలో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తులో మరో ముందడుగేసింది. ఈ కేసు వెలుగుచూసినప్పటి నుంచి దేవికారాణి ఆస్తులపై ఏసీబీ కూపీలాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దేవికారాణి ఆదాయ వ్యయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నుంచి సమగ్ర వివరాలు అవినీతి నిరోధక శాఖకి అందినట్లు సమాచారం. దేవికారాణి ఐటీ రిటర్నులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని గత నెలలో ఏసీబీ కోరిన నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు ఆమె చెల్లించిన పన్నులకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ శాఖ లేఖ ద్వారా అందజేసింది.  

శ్రీహరి వివరాలు ఇలాగే
ఈ కేసులో శ్రీహరి వివరాలు తెలుసుకున్న పంథాలోనే ఏసీబీ దేవికారాణి ఐటీ వివరాలనూ సేకరించింది. శ్రీహరి ఏటా రూ.19 కోట్లు ఐటీ కట్టినట్లు తేలింది. ఇదే తరహాలో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టిన దేవిక ఐటీ రిటర్నులను పరిశీలించాలని ఏసీబీ నిర్ణయించింది. 

మరోసారి కస్టడీకి...
ఐఎంఎస్‌ కేసులో 22 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. త్వరలోనే దేవికారాణి, పద్మలను మళ్లీ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు వీరు పలుచోట్ల కొనుగోలు చేసిన ఆస్తులు, చెల్లించిన ఆస్తుల రిటర్నులపై ఆరా తీసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.

>
మరిన్ని వార్తలు