ఏసీబీ వలలో జేసీ సీసీ 

21 Feb, 2019 11:07 IST|Sakshi
లంచం డబ్బుతో పట్టుబడిన జేసీ సీసీ తాజొద్దీన్‌

భూపాలపల్లి: వివిధ శాఖల్లో నిత్యం దాడులు జరిపే అవినీతి నిరోధక శాఖ ఈసారి ఏకంగా జిల్లా కలెక్టరేట్‌లోనే పంజా విసిరింది. లంచం కోసం కక్కుర్తి పడిన ఓ అధికారిని బుధవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారిం ది. ఏసీబీ డీఎస్పీ కె భద్రయ్య, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ పట్టణానికి చెందిన బియ్యం వ్యాపారి జన్ను అనిల్‌ గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో ఓ లారీలో 162 క్వింటాళ్ల బియ్యాన్ని ములుగు మీదుగా తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ములుగు పోలీసులు లారీని పట్టుకొని సీజ్‌ చేశారు. దీంతో అనిల్‌ హైకోర్టును ఆశ్రయించగా సీజ్‌ చేసిన బియ్యాన్ని రిలీజ్‌ చేయాలని అక్టోబర్‌ 23న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రతులను అక్టోబర్‌ 30న  జేసీ స్వర్ణలత సీసీ ఎండీ తాజొద్దీన్‌కు అప్పగించారు. తన బియ్యాన్ని రిలీజ్‌ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు.

బియ్యం రిలీజ్‌ ఆర్డర్‌ కాపీ తీసుకునేందుకని ఈ నెల 5న సీసీ తాజొద్దీన్‌ వద్దకు అనిల్‌ వచ్చాడు. అయితే లంచం ఇవ్వనిదే రిలీజింగ్‌ ఆర్డర్‌ ఇవ్వనని సదరు అధికారి చెప్పాడు. సుమా రు పది రోజుల పాటు సీసీని బాధితుడు అనిల్‌ బతిమిలాడాడు. అయినప్పటికీ అతడు కనికరించలేదు. రిలీజింగ్‌ ఆర్డర్‌ కాపీ కోసం రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేయసాగాడు. దీంతో చేసేది లేక బాధితుడు అనిల్‌ రూ. 50 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని అనిల్‌ ఇటీవల వరంగల్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.

ఏసీబీ అధికారుల సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని జేసీ సీసీ గదిలో అనిల్‌ రూ. 45 వేలు సీసీ తాజొద్దీన్‌కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె భధ్రయ్య, అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుకున్న నగదును స్వాధీనం చేసుకొని తాజొద్దీన్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని సీసీ కెమెరాల పుటేజీలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. లంచం తీసుకున్న తాజొద్దీన్‌ బుధవారం ఎవరెవరిని కలిశారనే విషయమై సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యా హ్నం నుంచి రాత్రి వరకు తాజొద్దీన్‌ను విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు రాత్రి అతడిని అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే కలెక్టరేట్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  

లంచం ఇవ్వడం ఇష్టం లేకనే.. 
 బియ్యం వ్యాపారం చేస్తాను. నా బియ్యాన్ని ములుగు పోలీసులు పట్టుకున్నారు. హైకోర్టును ఆశ్రయించగా బియ్యాన్ని రిలీజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్‌ కాపీలు ఇచ్చినప్పటికీ రిలీజింగ్‌ ఆర్డర్‌ కాపీని సీసీ తాజొద్దీన్‌ ఇవ్వడం లేదు. రూ. లక్ష లంచం కావాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించా. రూ. 45 ఇచ్చి తాజొద్దీన్‌ను ఏసీబీకి పట్టించా.  – జన్ను అనిల్, బాధితుడు 

విచారణ కొనసాగుతోంది.. 
జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ స్వర్ణలత సీసీ తాజొద్దీన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై విచారణ జరుపుతున్నాం. సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిపై కేసులు నమోదు చేసేందుకు వెనుకాడం.  – కె భద్రయ్య, ఏసీబీ డీఎస్పీ  

మరిన్ని వార్తలు