అవినీతి సొమ్ముతో ఆభరణాలు

1 Nov, 2019 03:46 IST|Sakshi
నాగలక్ష్మీ

రూ.3 కోట్లతో బంగారు నగలు కొనుగోలు చేసిన దేవికారాణి

తాజాగా ఆమెకు చెందిన డొల్ల కంపెనీల గుర్తింపు

తేజ ఫార్మా ఎండీ సోదరుడు శ్రీనివాసరెడ్డి పేరిట 2 షెల్‌ కంపెనీలు

అల్వాల్‌లోని శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో వెలుగుచూసిన మందుల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దేవికారాణికి చెందిన డొల్ల కంపెనీలను గుర్తించారు. ఈ కంపెనీలు దేవికారాణితో కలసి మం దుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డ తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి పేరిట ఉన్నాయి. దీం తో గురువారం అల్వాల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇంటి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి వరకు దాడులు కొనసాగాయి. తాజా సమాచారంతో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

రూ.కోట్లలో ఆర్జన..
ఈఎస్‌ఐలో ప్రభుత్వ జీవో 51 ప్రకారం.. ఆర్సీ (రేటెడ్‌ కంపెనీ)లకే మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎన్‌ఆర్సీ కంపెనీలకు అవకాశం ఇవ్వాలి. కానీ డైరెక్టర్‌ హోదాలో ఉన్న దేవికారాణి ఈ లొసుగును ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారన్నది ఏసీబీ అభియోగం. కమీషన్ల కోసం తేజ, ఓమ్ని, మెడీ వంటి కంపెనీల చేత అవసరానికి మించి, అధిక ధరలకు మందులు కొనుగోలు చేయించినట్లు ఏసీబీకి ఆధారాలు దొరుకుతున్నాయి.

కాగితాల మీద కంపెనీలు సృష్టించి వాటికి బిల్లులు మంజూరు చేయించుకుని, పంచుకున్నారన్న ఆరోపణలు తాజాగా ఏసీబీ తనిఖీల్లో లభిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో దేవికారాణికి ఫార్మాసిస్ట్‌ కొడాలి నాగలక్ష్మి సహకరించింది. నకిలీ కంపెనీలకు భారీగా బిల్లులు మంజూరు చేసి వీరిద్దరూ రూ.కోట్లు గడించారు. దేవికారాణి ఏకంగా రూ.3 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు కొన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడిది? అంత విలువైన ఆభరణాలు ఎలా కొనగలిగారు? అన్న వివరాలపై అధికారులు కూపీ లాగుతున్నారు.

రూ.10 కోట్లు దాటిన అక్రమాలు 
ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల గోల్‌మాల్‌లో మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మలు పోటీపడ్డారు. ఫలితంగా ఈఎస్‌ఐకి రూ.9.28 కోట్లు నష్టం వాటిల్లింది. తాజాగా 2017–18కి సంబంధించిన 22 ఇండెంట్లలో రెండింటిని విశ్లేషించిన ఏసీబీ అధికారులు రూ.70 లక్షలకుపైగా ఈఎస్‌ఐ సొమ్ము పక్కదారి పట్టిందని తేల్చారు. దీంతో ఈ వ్యవహా రంలో వెలుగుచూసిన అవినీతి రూ.10 కోట్లు దాటింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన 16 మంది రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సేకరించిన ఆధారాలతో మరిం త మందిని అరెస్టు చేయనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు