ఏసీబీకి చిక్కిన  మెప్మా డీఎంసీ 

10 May, 2019 06:41 IST|Sakshi
కమలశ్రీని విచారిస్తున్న ఏసీబీ అధికారులు

ఖమ్మంటౌన్‌: ఖమ్మం జిల్లా మెప్మా డీఎంసీ(డిస్ట్రిక్ట్‌ మెషిన్‌ కోఆర్డినేటర్‌) మన్నేపల్లి కమలశ్రీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ (ఆర్‌పీ) నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం నగరంలోని మెప్మా కార్యాలయంలో తన సీటు వద్దనే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడింది. గత కొన్ని సంవత్సరాలుగా డీఎంసీపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఆగడాలు హెచ్చుమీరడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. నగరంలోని గొల్లగూడెం శాంతి సమాఖ్య సంఘానికి చెందిన ధనలక్ష్మి రిసోర్స్‌ పర్సన్‌గా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుండగా..ఆమె విద్యార్హత విషయంలో సదరు అధికారి లంచం డిమాండ్‌ చేయడంతో..విసిగి వేసారి ఏసీబీకి పట్టించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌పీలకు నెలకు రూ.4 వేలు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించగా..కనీస విద్యార్హత పదో తరగతి చేసింది.

ఈ క్రమంలో కొందరు ఆ మేరకు సర్టిఫికెట్లు లేనివారుండగా..ధనలక్ష్మి పదో తరగతి పాస్‌ కాకపోవడంతో గత కొంత కాలంగా ఆర్‌పీగా విధుల నుంచి తొలగిస్తానంటూ డీఎంసీ బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే ప్రస్తుతం పనిచేసే వారికి టెన్త్‌ పూర్తి చేయాడానికి కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఆర్‌పీ ధనలక్ష్మి  మరోమారు వెళ్లి డీఎంసీ కమలశ్రీని కలిసి బతిమాలడంతో రూ.50వేలు ఇవ్వాలని ఒప్పదం చేసుకున్నారు.

అంత డబ్బు చెల్లించలేనని నిర్ణయించుకున్న ధనలక్ష్మి ఏసీబీ ఆధికారులను ఆశ్రయించింది. దీంతో వారి సూచనలతో గురువారం రూ.40 వేలను ముందస్తుగా తీసుకెళ్లిన ధనలక్ష్మి మరో ఆర్‌పీ ఉషతో కలసి వెళ్లి మెప్మా కార్యాలయంలో తన సీట్‌లో కూర్చొని ఉన్న డీఎంసీ కమలశ్రీకి డబ్బు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ నల్లగొండ రేంజ్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక దాడి నిర్వహించి..కమలశ్రీ టేబుల్‌ సొరుగులో ఉన్న రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమె చేతివేళ్ల అచ్చులను సేకరించారు. మెప్మాలోని పలు అంశాలపై ఏసీబీ ఆధికారులు కమలశ్రీని ప్రశ్నించారు. అనంతరం ఆమెను వీడీవోస్‌ కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తరలించారు.  

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం.. 
మెప్మా డీఎంసీ కమలశ్రీపై ఆర్‌పీ ధనలక్ష్మి మాకు ఈ నెల 6న ఫిర్యాదు చేసింది. ఆర్‌పీ ఉద్యోగంలో కొన సాగలంటే రూ.50 వేలు చెల్లించాల్సిందేనని వేధిస్తోం దని బాధితురాలు మా వద్దకు వచ్చి సంప్రదించింది. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఏవరైనా లంచం అడిగితే సమాచారం అందించండి. కమలశ్రీ 2007 నుంచి మెప్మాలో ఉద్యోగం చేస్తోంది. 12 సంవత్సరాలుగా ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బినామీల పేరుతో ఆస్తులు కూడపెట్టినట్లు కూడా ఏసీబీ ఆధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల రూ.15లక్షలతో కొత్త కారును కూడా కొనుగోలు చేసిన దానిపై కూడా విచారణ జరుపుతాం. – ఆనంద్‌కుమార్, ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ రేంజ్‌ 

మరిన్ని వార్తలు