ఏసీబీ వలలో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌

12 Oct, 2017 04:38 IST|Sakshi

శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో రూ.5 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లో డిస్టిలరీస్‌ ఇన్‌చార్జి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. బుధవారం డీఎస్పీ రవికుమార్‌ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ సికింద్రాబాద్‌లోని శ్రీనివాస్‌రెడ్డి నివాసంతో పాటు కరీంనగర్, మేడ్చల్‌లోని బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో రూ.5 కోట్ల మేర అక్రమ ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు తెలిపారు.

మేడ్చల్‌ జిల్లా పేట్‌బషీరాబాద్‌లో రూ.7.15 లక్షల విలువైన స్థలం, సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో రూ.25 లక్షల విలువైన నివాస గృహం, పేట్‌బషీరాబాద్‌లో రూ.1.4 లక్షల విలువైన 68 గజాల స్థలం, పేట్‌ బషీరాబాద్‌లో రూ.35 లక్షలతో నిర్మిస్తున్న భవంతి, శ్రీనివాస్‌రెడ్డి బినామీగా ఉన్న అతడి మామ భాస్కర్‌రెడ్డి పేరు మీద కట్టిన రూ.25 లక్షల విలువైన ఇళ్లు, జీడిమెట్లలో మామ పేరు మీద కొనుగోలు చేసిన రూ.7.11 లక్షల విలువైన ప్లాట్, రూ.8 లక్షల విలువైన మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌ కారు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రూ.5.2 లక్షల విలువగల 3.5 ఎకరాల భూమి, హస్మత్‌పేట్‌లో రూ.22 లక్షల విలువ గల 220 గజాల ప్లాట్, కరీంనగర్‌లో రూ.4 లక్షల విలువైన మామిడి తోట, బ్యాంకు, ఇంట్లో కలిపి రెండు కిలోల వెండి, 40 తులాల బంగారు ఆభరణాలు గుర్తించామన్నారు. సోదాల్లో బయటపడ్డ ఆస్తులు రూ.1.57 కోట్లు కాగా మార్కెట్‌ విలువ ప్రకారం రూ.5 కోట్లు ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు