ఏసీబీ వలలో ఎక్సైజ్‌ ఇన్‌చార్జి డీసీ

4 Nov, 2017 12:18 IST|Sakshi

లెక్కలు చూపని రూ.4.50 లక్షల నగదు స్వాధీనం

శ్రీకాకుళం సిటీ: జిల్లాలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర శుక్రవారం స్థానిక విలేకరులకు వెల్లడించారు. మద్యం వ్యాపారుల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారనే అభియోగాలపై శుక్రవారం ఏసీబీ అధికారులు ఎక్సైజ్‌శాఖ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌ ఇంటిపై దాడులు చేశారు. నగరంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్‌లో అద్దెకు ఉంటున్న శివప్రసాద్‌ ఇంట్లో క్షుణ్నంగా సోదాలు నిర్వహించారు. లెక్కలో లేని రూ.4.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ నగదును సీజ్‌ చేశామని, దీనిపై  సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిస్తామని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. కాగా 2015 నుంచి శివప్రసాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా జిల్లా ప్రొషిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖలో పనిచేస్తున్నారు. 2017 ఫిబ్రవరి నుంచి ఇన్‌చార్జి డీసీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏసీబీ తనిఖీల్లో సీఐలు రమేష్, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు