దేవికారాణి.. కరోడ్‌పతి

6 Dec, 2019 03:45 IST|Sakshi

ఐఎంఎస్‌ కేసు నిందితురాలు దేవికారాణి, బంధువుల

ఇళ్లపై ఏసీబీ దాడులు

హైదరాబాద్, తిరుపతి, కడపల్లో ఏకకాలంలో సోదాలు

భర్త, కుటుంబసభ్యుల పేరిట భారీగా ఆస్తుల కొనుగోలు

ఆమె భర్త గురుమూర్తిని అరెస్టు చేసిన ఏసీబీ

ఐఏఎస్‌ అధికారి పాత్ర పైనా త్వరలో విచారణ?

సాక్షి, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణంలో మరో సంచలనం వెలుగుచూసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, ఆమె బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో చేసిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఈ ఆస్తులన్నీ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి కుటుంబసభ్యుల పేరిట ఉన్నాయి. గురువారం హైదరాబాద్, తిరుపతి, కడపలోని ఆమె బంధువుల ఇళ్లల్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు, భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

వాటి విలువ దాదాపు రూ.25 కోట్లుగా లెక్కగట్టారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.250 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐఎంఎస్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో పలు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కయి అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించి రూ.కోట్లల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలకు ఏసీబీ అధికారులు భారీగా ఆధారాలు సంపాదించారు.

దిమ్మతిరిగేలా ఆస్తులు.. 
ఐఎంఎస్‌లో కోట్ల రూపాయల అవినీతి జరిగిన కేసులో ఇప్పటిదాకా మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మలతోపాటు పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, వారి బినామీలను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం దేవికారాణి భర్త గురుమూర్తి అరెస్టుతో ఈ సంఖ్య 18కి చేరింది. అనంతరం అతడిని చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌ కోసం తరలించారు. ఏసీబీ దాడుల్లో ఆమె విలాసవంతమైన ఆస్తులు చూసి అధికారులే విస్తుపోయారని విశ్వసనీయ సమాచారం.

విల్లాలు, అపార్ట్‌మెంట్లు, స్థలాలు, ఇళ్లు, నగలు, లగ్జరీ కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కోట్ల రూపాయల డిపాజిట్లను గుర్తించారు. లగ్జరీ కార్లను కుటుంబసభ్యుల పేరిట కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీలో అమరావతి, తిరుపతి, వైజాగ్‌లో, తెలంగాణలోని ఉమ్మడి మెదక్‌ జిల్లా రామాయంపేట, చేగుంట, రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయని వెల్లడించారు.

ఐఏఎస్‌ అధికారి పాత్రపైనా ఆధారాలు? 
ఆమెకు చెందిన స్థిరాస్తుల డాక్యుమెంట్‌ విలువ రూ.25 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు దాడుల్లో దొరికిన వివరాలన్నీ చూస్తే దేవికారాణి ఆస్తులు రూ.350 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఒక్క పీఎంజే జ్యువెల్లరీస్‌కే నగల కోసం ఏకంగా రూ.7.3 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఈ కేసులో దేవికారాణి బినామీలైన నాగలక్ష్మి, వీరన్న ఆస్తుల లెక్క తేలాల్సి ఉంది.

మరో బినామీని త్వరలోనే ఏసీబీ అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పాత్రపైనా ఏసీబీ కొన్ని ఆధారాలు సంపాదించినట్లు సమాచారం. సదరు ఐఏఎస్‌కు కూడా ముడుపులు అందాయని మొదటి నుంచీ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్రపై మరిన్ని ఆధారాలు లభించి, స్పష్టత వస్తే ఈ కేసు మరో మలుపు తిరగనుంది.

మరిన్ని వార్తలు