ఏపీలో 13 జిల్లాల్లో ఏసీబీ దాడులు

10 Jan, 2020 18:16 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు

భారీస్థాయిలో నగదు స్వాధీనం

ఏపీలోని 13 జిల్లాల్లో రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏకకాలంలో చేపట్టిన ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ దాడుల్లో 10.34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏబీసీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రజల నుంచి 14400 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదులతో మెరుపుదాడులు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

విజయనగరం: విజయనగరం వెస్ట్‌జోన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్‌కి వస్తున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తున్నామని  ఏసీబీ డిఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. ఎనిమిది మంది అనధికార డాక్యుమెంట్‌ రైటర్స్‌ నుంచి రూ.50వేలు, రిజిస్ట్రార్‌  కార్యాలయం  సిబ్బంది దగ్గర నుంచి రూ.11 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అనంతపురం: అనంతపురం రూరల్‌ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ సత్యనారాయణ మూర్తి నుంచి రూ.2.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ తో పాటు, కొంతమంది ప్రైవేటు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

తూర్పుగోదావరి: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించారు.దాడులు జరుగుతున్నాయని ముందుగానే సమాచారం అందడంతో కొందరు అధికారులు తప్పించుకున్నారు. కాకినాడ అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కార్యాలయ సిబ్బంది వద్ద అనధికారికంగా లెక్కల్లో లేని రూ.1,29,640 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. ప్రజల నుంచి ‘14400 కాల్‌ సెంటర్‌’ కు వచ్చిన ఫిర్యాదులతో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేపడుతున్నామని ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌ వెల్లడించారు.

ప్రకాశం: జిల్లాలోని  సింగరాయకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలువురి సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

విశాఖపట్నం: అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ  అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు సమక్షంలో రూ. 83,660 నగదును సీజ్‌ చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, రికార్డులను అడిషనల్‌ ఎస్పీ షకీలా భాను, ఏసీబీ డీఎస్పీ రంగరాజు తనిఖీలు చేశారు.  పలువురి సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు.

శ్రీకాకుళం: కాశీబుగ్గ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయ రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. పలువురి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు.

పశ్చిమగోదావరి: జిల్లాలోని కొవ్వూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.84 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో ఉన్న ముగ్గురు డాక్యు మెంట్‌ రైటర్లను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

గుంటూరు: తెనాలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఆకస్మిక దాడుల్లో కార్యాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.16,250 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు