ఏసీబీ వలలో ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు

6 Nov, 2019 14:08 IST|Sakshi
గుణ్ణం సత్యనారాయణ చౌదరి (ఫైల్‌)

సాక్షి, విజయవాడ/కాకినాడ: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఇద్దరు ప్రభుత్వ అధికారులు చిక్కారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో విజయవాడ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న మురళీ గౌడ్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు చేశారు. సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదును అధికారులు గుర్తించినట్టు సమాచారం. 2014లో సీఆర్డీఏలో టౌన్ ప్లానింగ్ అధికారిగా, 2017లో తిరుపతిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా విధులు నిర్వస్తున్న సమయంలో మురళీ గౌడ్ భారీగా అక్రమాస్తులు కూడపెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విజయవాడతో పాటు తిరుపతి, కర్నూల్, హైదరాబాద్, బెంగళూరులో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సుమారు 50 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు కలిగివున్నారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న గుణ్ణం సత్యనారాయణ చౌదరి నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జగన్నాధపురం మరీడమ్మపేటలోని సత్యనారాయణ నివాసంతో పాటు కాకినాడ, రెండు రావులపాలెంలో రెండేసి చోట్ల, సామర్లకోటలో ఒక చోట ఏకకాలంలో దాడులు చేశారు. కేజీన్నర బంగారు ఆభరణాలు, కేజీ వెండి సహా రూ. రెండున్నర కోట్లు విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బ్యాంకు అకౌంట్లు సహా, పలు బ్యాంకుల్లో లాకర్లు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

>
మరిన్ని వార్తలు