ఏసీబీ వలలో మరో తిమింగలం..

4 Oct, 2017 16:00 IST|Sakshi

దాదాపు రూ. 50కోట్లు ఆస్తులున్నట్లు గుర్తింపు

ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఏసీబీ దాడులు

సాక్షి, అనంతపురం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డి ఇంట్లో ఏసీబీ బుధవారం దాడులు జరిపింది. ఆయన మహిళా, సంక్షేమశాఖ పెనుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.  అవినీతి నిరోదకశాఖ జిల్లా ఇన్చార్జ్ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో కొంతమంది సీఐలు ఎనిమిది బృందాలుగా విడిపోయి ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు నిర్వహించారు. నారాయణరెడ్డి ఆస్తులు, అతని బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. జిల్లాతోపాటు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలం రామచేర్ల గ్రామంలో కూడా సోదాలు జరిపారు. 

ఈ దాడుల్లో దాదాపు రూ. 50 కోట్లు విలువైన స్థిర, చరాస్తులను గుర్తించిట్లు అధికారులు వివరించారు. మహిళా, శిశుసంక్షేమశాఖలో నారాయణరెడ్డి సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. అటెండర్‌ నుంచి పదోన్నతులపై సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో కీలక విభాగాల సూపరింటెండెంట్‌గా దాదాపుగా ఎనిమిదేళ్ళపాటు పని చేశారు. ముఖ్యంగా అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా చేసే కోడిగుడ్లు, పౌష్టికాహారానికి సంబంధించిన సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా చేశారు. ఈ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

 ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో బుధవారం దాడులు జరిగాయి. అనంతపురంలోని కోవూర్‌నగర్‌లో ఆయన నివాసంలోనూ, నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన గృహాల్లోనూ, బందువుల ఇళ్ళలో, నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామంలో అత్త, మామల ఇంటిలో, పాకాల మండలంఓని రామచేర్ల గ్రామంలోని తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిలో దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ జయరామరాజు తెలిపారు. ఈ దాడుల్లో కేజిన్నర బంగారు, భారీ మొత్తంలో వెండీ, వ్యవసాయ భూములకు సంబంధించిన విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. విచారణ అనంతరం నిందితున్ని కస్టడీలోకి తీసుకొని కర్నూల్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. 

మరిన్ని వార్తలు