సిద్దిపేట అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్‌

19 Dec, 2019 19:12 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిద్దిపేట అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గోవిందు నర్సింహారెడ్డి అరెస్ట్‌ అయ్యారు. ఆయనను ఏసీబీ అధికారులు గురువారం కోర్టులో హాజరు పరచగా, ఏసీబీ న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో నర్సింహారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా అక్రమ ఆస్తుల ఆరోపణలతో అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి నివాసంతో పాటు ఆయన బినామీల ఇళ్లపై గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సిద్ధిపేట, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, జహీరాబాద్‌, షాద్‌నగర్‌తో పాటు ఆయన స్వగ్రామం వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలోనూ దాడులు చేశారు.  

సోదాల్లో కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల 33వేలు నగదు, నర్సింహారెడ్డి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.6.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గొల్కొండలో ఒక విల్లా, శంకర్‌పల్లిలో 14 ఫ్లాట్లు, జహీరాబాద్‌, సిద్ధిపేట, మహబూబ్‌ నగర్‌లో 20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. రెండు కార్లు సీజ్‌ చేశారు. ఏసీబీ అధికారుల సోదాల్లో  రూ.5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. 

 

మరిన్ని వార్తలు