ఉత్తమ అధికారే... అవినీతి తిమింగలమా ?

7 Nov, 2019 08:58 IST|Sakshi
ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న మురళీగౌడ్‌ (ఫైల్‌) 

తిరుపతి కార్పొరేషన్‌ పూర్వ ఏసీపీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

నగరంలోనూ ఆధారాల కోసం ఇద్దరు కార్పొరేషన్‌ ఉద్యోగుల ఇళ్లలో సోదాలు

సాక్షి, తిరుపతి: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల ఇళ్లలో బుధవారం జరిగిన ఏసీబీ దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి. విజయవాడ, ఏసీబీ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులతో పాటు తిరుపతి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తిరుపతి కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ(అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌)గా పనిచేసి ఇటీవల విజయవాడ కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లిన మురళీగౌడ్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెల్లవారుజాము నుంచి దాడులు చేపట్టారు.

విజయవాడతో పాటు తిరుపతి, కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌లో ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా తిరుపతి మున్సి పల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌ వైజర్‌ శారద, రెవెన్యూ శాఖలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే మురళీగౌడ్‌ ఆస్తులు వీరి వద్ద ఉన్నాయన్న సమాచారం ఆధారంగా మాత్రమే దాడులు నిర్వహించారు. మురళీ గౌడ్‌తో పాటు టీపీఎస్‌ శారద, బిల్‌కలెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి పైన ఏసీబీ దాడి చేస్తుందని కార్పొరేషన్‌లో తీవ్ర చర్చ జరిగింది. వీరిపై ఎలాంటి ఆరోపణలు రాలేదని,  మురళీగౌడ్‌కు సంబంధించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ సీఐ విజయ్‌శేఖర్‌ వెల్లడించారు. దీంతో తోటి అధికారులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఫిర్యాదులు అందడంతోనే సోదాలు 
తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌లో ఏసీపీగా 2017 నుంచి గత నెల వరకు పనిచేసిన మురళీగౌడ్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆధారాలతో సహా ఫిర్యాదులు అందాయని ఏసీబీ సీఐ విజయశేఖర్‌ మీడియాకు వెల్లడించారు.  5 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తిరుపతిలో పనిచేయడంతో ఇక్కడ సోదాలు జరుపుతున్నట్లు చెప్పారు. తిరుపతి కార్పొరేషన్‌లో ఏసీపీగా పనిచేసే సమయంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన శారద వద్ద అతనికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయని సమాచారం వచ్చిందన్నారు. అలాగే బిల్లు కలెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి వద్ద కూడా మురళీగౌడ్‌ ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో సోదాలు చేశామన్నారు. టీపీఎస్‌ శారద ఇంట్లో రూ. 13 లక్షలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ డబ్బుకు సంబంధించి ఆధారాలు చూపిస్తే ఆమెకే అప్పగిస్తామన్నారు. సరైన ఆధారాలు లేని పక్షంలో విచారణ జరిపి ఫిర్యాదు ఆధారంగా ఆ డబ్బులు మురళీగౌడ్‌విగా భావించి సీజ్‌ చేస్తామన్నారు. కేసుకు టీపీఎస్‌ శారదాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బిల్‌కలెక్టర్‌ శ్రీనివాసులు ఇంట్లో సుమారు రూ. 2 లక్షల నగదు గుర్తించినట్లు చెప్పారు. మురళీగౌడ్‌కు సంబంధించిన ఎలాంటి పత్రాలు వీరి వద్ద లభ్యం కాలేదని ఆయన వెల్లడించారు.

కాగా తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏసీపీగా మురళీగౌడ్‌ పనిచేస్తూ.. ఉత్తమ సేవలు అందించారని 2018 ఆగస్టులో అప్పటి కమిషనర్‌ విజయరామరాజు చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఏసీపీ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, పత్రాలు నమోదు చేసుకోవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఉత్తమ అధికారే అవినీతి తిమింగలంగా మారాడా ? అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా