ఏసీబీ వలలో ఏపీ ప్లానింగ్‌ అధికారి 

30 Jan, 2018 02:38 IST|Sakshi
అడిషనల్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ పసుమర్తి ప్రదీప్‌కుమార్

వుడా అడిషనల్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌పై అక్రమాస్తుల కేసు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 12 చోట్ల ఆకస్మిక దాడులు

రూ. 50 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తుల గుర్తింపు  

సాక్షి, అమరావతి/ విశాఖ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి చిక్కాడు. కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఆస్తులు కూడబెట్టిన అతడి ‘కంత్రీ’ ప్లానింగ్‌ను ఏసీబీ రట్టు చేసింది. విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) అడిషనల్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ పసుమర్తి ప్రదీప్‌కుమార్, అతడి బంధువులు, స్నేహితుల నివాసాలపై సోమవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించింది. పదోన్నతి పొందిన కొద్ది రోజులకే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై ఏసీబీ దాడులు చేయడం గమనార్హం.

సోదాల్లో పలు విలువైన ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల కట్టలు, బ్యాంకు పాసు పుస్తకాలను ఆధికారులు స్వాధీనం చేసుకున్నారు. 9.20 ఎకరాల వ్యవసాయ భూమి, ఐదు ఖాళీ స్థలాలు, నాలుగు ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రదీప్‌కుమార్‌కు చెందిన మూడు బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెరిస్తే మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. దాడుల్లో దొరికిన పత్రాలు, ఆధారాలను బట్టి బహిరంగ మార్కెట్‌లో ఆయన ఆస్తుల విలువ రూ.50 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాలకు చెందిన ప్రదీప్‌కుమార్‌ 1984 మే 5న పట్టణాభివృద్ధి సంస్థలో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు.

మరిన్ని వార్తలు