కోట్లకు పడగెత్తిన హెడ్‌

27 Jul, 2018 14:15 IST|Sakshi
హెడ్‌కానిస్టేబుల్‌ను ప్రశ్నిస్తున్న సీఐ ఖాదర్‌బాషా జేమ్స్‌పేటలో ఇటీవల నిర్మించిన విలాసవంతమైన భవంతి

హెడ్‌ కానిస్టేబుల్‌  రూ.7 కోట్ల అక్రమాస్తులు

పక్కా సమాచారంతో ఏసీబీ దాడులు

దాడుల్లో విలాసవంతమైన భవంతులు,

నగదు, బంగారు గుర్తింపు

ప్రొద్దుటూరు కడప, బెంగళూరులో ఏకకాలంలో సోదాలు

ప్రొద్దుటూరు క్రైం : ఆ హెడ్‌కానిస్టేబుల్‌ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. ప్రొద్దుటూరులో హెడ్‌ కానిస్టేబుల్‌ చిన్న వీరయ్య ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరుతోపాటు కడప, బెంగళూరులోని అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ దాడులు జరిగాయి. ప్రొద్దుటూరులోని త్యాగరాజనగర్‌లో నివాసం ఉంటున్న చిన్న వీరయ్య బి.మఠం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతను ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నాడని సమాచారం రావడంతో జిల్లా ఏసీబీ డీఎస్పీ నాగరాజు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరులోని త్యాగరాజనగర్, లైట్‌పాలెం, శ్రీనివాసనగర్, జేమ్స్‌కొట్టాలలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిన్న వీరయ్య 1993లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేశాడు. ప్రొద్దుటూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2013లో హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ పొంది బి.మఠం స్టేషన్‌కు బదిలీ అయ్యాడు.

బ్యాంకుల్లో రుణం తీసుకున్నా..
ఇళ్ల నిర్మాణం కోసం 10 బ్యాంకుల్లో రుణం తీసుకున్నానని హెడ్‌ కానిస్టేబుల్‌ చిన్న వీరయ్య ఏసీబీ అధికారులకు తెలిపాడు. తనంటే గిట్టని వాళ్లు కావాలనే ఫిర్యాదు చేశారన్నాడు. తనకు అక్రమాస్తులు లేవని ఉన్న ఆస్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు.

రూ 7 కోట్ల మేర ఆస్తులు ..
ఏసీబీ దాడుల్లో రూ.7కోట్ల మేర హెడ్‌కానిస్టేబుల్‌ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో 6 సెంట్లలో ఇళ్లు, మోడంపల్లెలోని జేమ్స్‌పేటలో 5 సెంట్లలో ఇటీవలే నిర్మించిన విలాసవంతమైన భవంతి, చాపాడు మండలంలో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, త్యాగరాజనగర్‌లో అరసెంటులో ఇల్లు, అనుమతి లేకుండా నిర్వహించే సంగీత పరికరాల దుకాణం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదు, బంగారం, స్థిరాస్తుల విలువ సుమారు రూ.7కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయని ఈ మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ చిన్న వీరయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సోదాల్లో సీఐలు రామచంద్ర, ఖాదర్‌బాషా సిబ్బంది పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ ఇంటిలో ఏసీబీ సోదాలు జరగడంతో పట్టణంలోని పోలీసులు ఒక్క సారిగా ఉలికిపాటుకు గురయ్యారు. అతను పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కలిగి ఉండటం  చర్చనీయాంశంగా మారింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా