ఏసీబీకి చిక్కిన ‘సర్వే’ తిమింగలం

1 Sep, 2019 07:36 IST|Sakshi
లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఐఎస్‌ ఏకాశి (నీలం రంగు షర్టు)ని ప్రశ్నిస్తున్న ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి

రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన టెక్కలి ఆర్డీఓ కార్యాలయం డీఐఎస్‌

భూమి సబ్‌ డివిజన్‌ విషయంలో ముప్పతిప్పలు  పెట్టిన వైనం

బాధితుడి నుంచి రూ.5 లక్షల డిమాండ్‌

ఏసీబీకి బాధితుడి ఫిర్యాదు

70 ఏళ్ల ఆర్డీఓ కార్యాలయం చరిత్రలో మొదటిసారి  ఏసీబీ దాడి

డీఐఎస్‌ను అరెస్టు చేసిన ఏసీబీ  డీఎస్పీ

సాక్షి, టెక్కలి: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 70 ఏళ్ల చరిత్ర కలిగిన టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో మొదటిసారిగా ఏసీబీ దాడులు జరిగాయి. లంచం తీసుకుంటూ డీఐఎస్‌ (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే) అధికారి నిమ్మక ఏకాశి ఏసీబీ అధికారులకు శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో డివిజన్‌ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూమి సబ్‌ డివిజన్‌ విషయంలో టెక్కలి ఆర్డీఓ కార్యాలయం డీఐఎస్‌ ఏకాశి లంచం డిమాండ్‌ చేస్తున్నారంటూ నందిగాం మండలం పోలవరం గ్రామానికి చెందిన దడ్ల క్రాంతి కిరణ్‌ రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ బీ.వీ.ఎస్‌.ఎస్‌ రమణమూర్తి నేతృత్వంలో సీఐలు భాస్కరరావు, హరితోపాటు ఇతర సిబ్బంది శనివారం కార్యాలయం వద్ద మాటు వేసి మధ్యాహ్నం సమయంలో డీఐఎస్‌ ఏకాశి బాధితుడు క్రాంతి కిరణ్‌ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వివరాలు సేకరించి అనంతరం కేసు నమోదు చేసి డీఐఎస్‌ను అరెస్టు చేశారు.

భూమి సబ్‌ డివిజన్‌కు లంచం డిమాండ్‌.. 
నందిగాం మండలం పోలవరం గ్రామానికి చెందిన దడ్ల క్రాంతి కిరణ్‌కు అదే మండలం పాలవలస సమీపంలో సర్వే నంబరు 244లోని 2ఏ, 3బీ, 4ఏ లో సుమారు 57 సెంట్లు, సర్వే నంబరు 246లోని 1బీ నంబరు 16 సెంట్లు భూమి ఉంది. ఎస్సీ కేటగిరిలో పెట్రోల్‌ బంక్‌ నిర్మాణం నిమిత్తం భూమిని సబ్‌ డివిజన్‌ చేసేందుకు జూలై 17న మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నారు. సర్వే ఫైలు  నందిగాం తహసీల్దారు కార్యాలయం నుంచి టెక్కలి ఆర్డీఓ కార్యాలయానికి ఫైలు చేరింది. పలుమార్లు డీఐఎస్‌ ఏకాశి వద్దకు కిరణ్‌ కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు రూ.5 లక్షలను డిమాండ్‌ చేసినట్లు క్రాంతి కిరణ్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తన జేబులో ఉన్న తక్కువ మొత్తాన్ని సైతం లాగేసుకున్నారని బాధితుడు వాపోయాడు. విసిగిపోయిన బాధితుడు గత రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.   

ఎంత వారినైనా విడిచిపెట్టేది లేదు.. 
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా చేయడమే ఏసీబీ లక్ష్యం. ఈ విషయంలో బాధితులు ఆశ్రయిస్తే ఎంత వారినైనా విడిచిపెట్టేది లేదు. ప్రజలకు సేవ చేయడమే అధికారుల పని. ఈ విషయంలో లంచాన్ని ప్రొత్సహించకుండా ప్రజలే ప్రశ్నించాలి. 
–బి.వి.ఎస్‌.ఎస్‌.రమణమూర్తి, ఏసీబీ డీఎస్పీ 

రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు.. 
నందిగాం మండలం పాలవలస సమీపంలో తనకు చెందిన మొత్తం 73 సెంట్లను సబ్‌ డివిజన్‌ చేయాలని టెక్కలి ఆర్డీఓ కార్యాలయం డీఐఎస్‌ ఏకాశిని ఆశ్రయించాను. మొదట లేనిపోని కొర్రీలు పెట్టారు. చివరకు ఖర్చు అవుతుందని చెప్పి రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు. పలుసార్లు చిన్న మొత్తాల్లో నగదును వసూలు చేశారు. విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. 
–దడ్ల క్రాంతి కిరణ్, బాధితుడు   

మరిన్ని వార్తలు