ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ

19 Jan, 2019 09:25 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తన్న ఏసీబీ డీఎస్పీ ఆనందకుమార్‌

లారీల విడుదలకు రూ.1.90 లక్షల డిమాండ్‌

సినీఫక్కీలో ఛేదించి పట్టుకున్న అధికారులు

అదుపులోకి తీసుకుని విచారణ

కోదాడ : కేసులో ఉన్న లారీలను విడుదల చేయడానికి లంచం తీసుకుంటూ కోదాడ పట్టణ ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ అనంద్‌కుమార్, సీఐ రఘుబాబు, వెంకట్రావ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన డి. వెంకటేశ్వరరావుకు లారీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ ఉంది. వీటి ద్వార కొత్తగూడెం నుంచి కర్ణాటకకు బొగ్గు రవాణా చేస్తుంటాడు. ఈ క్రమంలో బొగ్గును మధ్యలో కల్తీ చేసి నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారని, ఈ కల్తీ కోదాడ పరిధిలో జరుగుతోందని సదరు కంపెనీ కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గత సంవత్సరం నవంబర్‌లో ఫిర్యాదు చేసింది. మూడు లారీలను కోదాడ పోలీసుల స్వాధీనం చేసుకుని దీనిపై క్రైం నంబర్‌ 373/2018 ద్వార 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై సదరు వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లి లారీల విడుదలకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనిలో భాగంగా కోర్టు ఉత్తర్వులతో లారీలను విడుదల చేయడానికి పట్టణ ఎస్‌ఐ కేటీ మల్లేశ్‌ను సంప్రదించారు.

మూడు లక్షల రూపాయలు డిమాండ్‌...
కోర్టు ఉత్తర్వుల ప్రకారం లారీల విడుదల చేయడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోదాడటౌన్‌ ఎస్‌ కె.టి.మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని వెంకటేశ్వరావు ప్రాథేయపడగా చివరకు  రూ.1.90వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని వెంకటేశ్వరరావు నల్లగొండ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల ప్రకారం శుక్రవారం డబ్బులను తీసుకుని వెంకటేశ్వరరావుతో పాటు ఆయన అనుచరుడు సురేష్‌ మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాల సమయంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్‌ఐను కలవగా వెంకటేశ్వరరావును అక్కడే ఉండమని డబ్బులు తీసుకుని సురేష్‌ను తన కారు (నెం: టీఎస్‌ 29 బి 0006)లో కూర్చోమని చెప్పాడు. అనంతరం తాను స్టేషన్‌ నుంచి బయటకు వచ్చి కారు తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. వీరిని ఏసీబీ అధికారులు అనుసరించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎస్‌ఐ కారును సందులు, గొందులు తిప్పుతూ మధ్యలో సురేష్‌ను డబ్బుతో సహా దించి వేశాడు. ఇది గమనించిన ఏసీబీ అధికారుల ఎస్‌ఐని వెంటాడి శ్రీరంగాపురం వద్ద పట్టుకున్నారు. డబ్బుతో పాటు కారును సీజ్‌ చేసి కోదాడ డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు.

ఉలిక్కిపడిన కోదాడ
ఎస్‌ఐ కె.టి మల్లేష్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడంతో కోదా డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందులోనూ పోలీస్‌ అధికారి చిక్కడం ఇంకా సంచలనం కలిగిం చింది. ఇప్పటి వరకు కోదాడలో పోలీసు అధికారి అవినీతి నిరోధక చిక్కిన దాఖలాలు లేవు. గడిచిన 20సంవత్సరాల కాలంలో కోదాడలో ఏసీబీకి చిక్కిన మూడో అధికారి కెటి,మల్లేష్‌. గతంలో వ్యవసాయశాఖ అధికారిగా పనిచేసిన సింగారెడ్డి, ఎన్‌ఎస్‌పీ ఏఈ దర్గయ్య ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.టి మల్లేష్‌ 2014వ బ్యాచ్‌కు చెందిన ఈయన మొదటిసారి ఎస్‌ఐగా సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్‌లో పని చేశారు. 2018 జూలైలో కోదాడ పట్టణ ఎస్‌ఐగా వచ్చారు.  శుక్రవారం అనూహ్యంగా ఆయన ఏసీబీకి చిక్కారు. పట్టణ ఎస్‌ఐ ఏసీబీ చిక్కారని తెలియడంతో కోదాడ పట్టణ స్టేషన్‌లో నిశబ్ద వాతావరణం నెలకొంది. ఒక్క అధికారి, కానిస్టేబుల్‌కానీ మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. పోలీసుల ఏసీబీ చిక్కారని బయటకు తెలిస్తే  పరువు పోతుందని, ఇది కోదాడ స్టేషన్‌కు మాయని మచ్చ అని పలువురు వాపోయారు.

మరిన్ని వార్తలు