పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్య

27 May, 2020 09:26 IST|Sakshi

సాక్షి, మంథని: వన్యప్రాణుల వేట కేసులో పోలీస్‌ కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకరు  ఠాణా ఆవరణలోని బాత్‌రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామగుండం కమిషనరేట్‌ పరిధిలో కలకలం సృష్టించింది. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం లక్కేపూర్‌ శివారులో ఈ నెల 24న వన్యప్రాణుల వేట కోసం మైదుపల్లికి చెందిన ఉప్పు కుమార్, మక్కాల మల్లేష్, సిద్దపల్లికి చెందిన తాటి సంపత్, రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్యలు విద్యుత్‌ తీగలు అమర్చుతుండగా మంథని ఎస్సై ఓంకార్‌యాదవ్‌ పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. (ఇండిగో ప్రయాణికుడికి కరోనా..)

ఈ క్రమంలో ఠాణాలోని నిందితుల్లో ఏ–3గా ఉన్న రంగయ్య(52) మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని బాత్‌రూంలో ఇనుప పైపునకు తలపాగాతో ఉరేసుకున్నాడు. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి నిందితులు బాత్‌రూం వద్దకు వెళ్లగా లోపల గడి పెట్టి ఉంది. వెంటనే తలుపు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడిపై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో రెండు వన్యప్రాణుల వేట కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. ఇటీవలే ఈ గ్యాంగ్‌ ఓ అడవి పందిని వేటాడి చ ంపినట్లు తెలిసిందన్నారు. ఫిజికల్‌ టార్చర్‌ ఏం లేదని, ఒకవేళ పోలీసుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతదేహానికి తహసీల్దార్‌ అనుపమరావు పంచనామా నిర్వహించారు. (మెట్రో ప్రయాణం: మరో 30 సెకన్లు పెంపు) 

మానవ హక్కుల కమిషన్‌ నిబంధనలకు లోబడి విచారణ 
జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నిబంధనలకు లోబడి కేసు విచారణ చేపడుతామని సీపీ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ను కేసు విచారణ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల వేటలో ఏటా 10 నుంచి 15 మంది చనిపోతున్నారన్నారు. గతేడాది సుమారు 450 మంది వేటగాళ్లను బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని బెల్లంపల్లి, జైపూర్, సుందిళ్ల ప్రాంతాల్లో నాలుగు పులులు  సంచరిస్తున్నాయని వెల్లడించారు. వాటికి ప్రాణహాని ఉందనే వన్యప్రాణులను వేటాడే వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ శాఖ నుంచి కూడా సమాచారం వచ్చిందన్నారు. రంగయ్య కుటుంబసభ్యులతో పాటు మిగతా నిందితుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తామని సీపీ పేర్కొన్నారు. వైద్య బృందం సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తామని తెలిపారు.

భారీగా మోహరించిన పోలీసులు
పోలీస్‌ కస్టడీలో ఉన్న రంగయ్య ఉరేసుకోవడంతో అతని కుటుంబసబ్యులు, ఇతర కుల సంఘాలు, రాజకీయ నాయకులు వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్‌తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఏసీపీలు, సీఐలు, ఇతర విభాగాల పోలీసులు మంథని ఠాణాకు చేరుకున్నారు. ఇతరులను పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించలేదు. మృతుడి బంధువులతో సంప్రదింపులు జరిపి, నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.  (హైదరాబాద్‌లోనే ‘ఫావిపిరవిర్‌’ )

రామయ్యపల్లిలో విషాదం
రామగిరి(మంథని): మంథని పోలీస్‌స్టేషన్‌లో రంగయ్య ఆత్మహత్మతో బుధవారంపేట పంచాయతీ పరిధిలోని రామయ్యపల్లిలో విషాదం నెలకొంది. మంగళవారం మృతుడి ఇంటి వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసు కేసు భయంతోనే రంగయ్య ఉరేసుకొని ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాజమ్మ, కుమారుడు అనిల్, కూతుళ్లు రజిత(వివాహం అయ్యింది), మౌనిక ఉన్నారు. 

సోమవారమే భోజనం తీసుకెళ్లాను
నాలుగు రోజుల కిందట నా భర్తను కలిశాను. సోమవారం కూడా భోజనం తీసుకెళ్లాను. ఆయన నాకేం చెప్పలేదు. ఇంతలో ఇలా సచ్చిపోయాడు. 
– రాజమ్మ, రంగయ్య భార్య

మరిన్ని వార్తలు