రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి..

19 Sep, 2019 10:18 IST|Sakshi

నకిలీ బంగారం కేసులో నిందితుల అరెస్ట్

రూ.4.10 లక్షల సొత్తు రికవరీ

నిందితులు వీరబల్లి మండలం షికారుపాళెం గ్రామస్తులు

సాక్షి, కడప/నెల్లూరు : నకిలీ బంగారం విక్రయించిన కేసులో నిందితులైన వీరబల్లి మండలం షికారుపాళెం గ్రామానికి రాణా తిరుమలనాయుడు, గోవిందు శ్రీనివాసులును నెల్లూరు రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి అరెస్టు చేశారు. వారి నుంచి చోరీ సొత్తు రూ.4.10 లక్షలు రికవరీ చేశారు. సంగం మండల పోలీసుస్టేషన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు.

ఏం జరిగిందంటే..
చేజర్ల మండలం మామూడూరు గ్రామానికి చెందిన డిష్‌ నిర్వాహకుడు ఎస్‌కే మహబూబ్‌బాషా ఆగస్ట్‌ నెల 13వ తేదీన నెల్లూరుకు వెళ్తున్నాడు. ఈక్రమంలో సంగం మండలం గాంధీజనసంఘం రాంపు వద్ద ఇద్దరు వ్యక్తులు కముజు పిట్టలు ఉండే బుట్టతో అతనికి కనిపించారు. మహబూబ్‌ వారిని కముజు పిట్టలు ఉన్నాయా అని అడగ్గా దొరకలేదని చెప్పారు. దొరికితే సమాచారం ఇస్తామని వారు మహబూబ్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారు. 26వ తేదీన సదరు వ్యక్తులు గాంధీజనసంఘం ర్యాంప్‌ వద్దకు వచ్చి మహబూబ్‌కు ఫోన్‌ చేసి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో పాత ఇల్లు తవ్వుతుండగా పురాతన బంగారు ఆభరణాలు దొరికాయని చెప్పారు.

అవి రాజులు ధరించినవి అని, తాము డబ్బు చేసుకోలేకపోతున్నామని, వచ్చి ఆభరణాలు చూసుకుంటే అతితక్కువ మొత్తానికి ఇస్తామని మహబూబ్‌కు చెప్పారు. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని నమ్మబలికారు. దీంతో అతను రాంపు వద్దకు వెళ్లి వారితో మాట్లాడాడు. ఇద్దరు రెండు బంగారు చైన్లు, గుండ్లతో కూడిన పెద్ద హారాన్ని చూపించారు. తమకు ఇప్పుడే డబ్బు అవసరం లేదని చెప్పి, గుండ్ల హారంలోని మూడు గుండ్లను తీసి మహబూబ్‌కు ఇచ్చి వీటిని పరీక్షించుకుని రూ.4.40 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో మహబూబ్‌ మూడు గుండ్లను సంగంలో బంగారు దుకాణాల్లో తనిఖీ చేయించగా బంగారమే అని తేలడంతో నిందితులకు రూ.4.40 లక్షలు నగదు చెల్లించారు. వారి వద్దనున్న రెండు బంగారు హారాలు, గుండ్లతో కూడిన మరో పెద్ద హారాన్ని తీసుకున్నాడు.

ఇత్తడి నగలని తేలింది
మహబూబ్‌ ఆభరణాలను గత నెల 28న నెల్లూరుకు తీసుకెళ్లి పరీక్షించగా అవి ఇత్తడి నగలని తేలింది. దీంతో ఖంగారు పడి మామూడూరు వెళ్లాడు. అక్కడినుంచి గాంధీజనసంఘం ర్యాంపు వద్దకు విచారించినా నిందితుల ఆచూకీ తెలియలేదు. ఈనెల 11వ తేదీ సంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి ఆదేశాలతో బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు. నిందితుల సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా విచారణ ప్రారంభించారు. కాగా నిందితులు మరొకరిని మోసం చేసేందుకు బుధవారం సంగం ఆనకట్ట వద్దకు చేరుకున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వైఎస్సార్‌ కడప జిల్లా వీరబల్లి మండలం షికారిపాళెం గ్రామానికి చెందిన రాణా తిరుమలనాయుడు, గోవిందు శ్రీనివాసులుగా గుర్తించారు. వారిని అరెస్ట్‌ చేసి రూ.4.10 లక్షల చోరీ సొత్తును, మూడు బంగారు గుండ్లు, రెండు రోల్డ్‌ గోల్డ్‌ చైన్లు, బంగారు పూత పూసిన ఇత్తడి హారం స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు