దా‘రుణం’

11 Mar, 2020 13:24 IST|Sakshi
అరెస్టు చేసిన నిందితులతో డీఎస్పీ పోతురాజు

అప్పు ఇచ్చిన వ్యక్తినే అంతమొందించారు

పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్లారు

వారిద్దరూ అన్నదమ్ములు. వ్యాపార అవసరాలకు అప్పు కావాలని ఓ వ్యక్తిని సంప్రదించారు. నమ్మకం లేకపోతే పొలం తాకట్టు పెడతామని నమ్మించారు. అంతగా అడుగుతున్నారు కదా అని అతనికి జాలి కలిగింది. పొలం తాకట్టు పెట్టుకుని రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ తర్వాత వారి అసలు రూపం బయట పడింది. అప్పు తిరిగి చెల్లించకుండా ఇచ్చిన వ్యక్తినే అంతమొందించారు. నమ్మి రుణం ఇచ్చిన వ్యక్తిపై ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులుమంగళవారం అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

ఆళ్లగడ్డ రూలర్‌: ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు కుమ్మరి శ్రీనివాసులు ఆచారి హత్య కేసు నిందితులను పోలీసు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలను స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో డీఎస్పీ పోతురాజు వెల్లడించారు. పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన మూరబోయిన చంద్రమౌళి, సోదరుడు మూరబోయిన నాగరాజు తమ వ్యాపారం నిమిత్తం అదే గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాసులు ఆచారి వద్ద పొలం తాకట్టు పెట్టి ఆరు నెలల క్రితం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు. మూడేళ్లలోపు డబ్బు చెల్లిస్తే పొలం వెనక్కి ఇచ్చేలా అగ్రిమెంట్‌ రాసుకున్నారు. 20 రోజుల క్రితం చంద్రమౌళి మరో రూ.2లక్షలు శ్రీనివాసులు ఆచారి వద్ద అప్పుగా తీసుకున్నాడు. అనంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి అప్పు ఎగ్గొట్టాలనే పన్నాగంతో శ్రీనివాసులు ఆచారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఉయ్యాలవాడకు చెందిన దూదేకుల సుభాన్‌బాషా, అతని తండ్రి దూదేకుల మాబుసుభాని, ఒగరు సుబ్రమణ్యంలతో రూ.2,40,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

అప్పు విషయం మాట్లాడదామంటూ ఫోన్‌..
ఈనెల 1న చంద్రమౌళి, నాగరాజు.. శ్రీనివాసులుఆచారికి ఫోన్‌ చేశారు. అప్పు విషయం మాట్లాడాలని, ఎక్కడ ఉన్నావని అడిగారు. తాను ఆళ్లగడ్డకు వెళ్తున్నాని, మళ్లీ మాట్లాడుకుందామని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఇదే అదునుగా భావించి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్న ముగ్గురిని రప్పించుకుని ఐదుగురు కలిసి ఆళ్లగడ్డకు చేరుకున్నారు. అక్కడ శ్రీనివాసులు ఆచారిని కలిశారు. మాట్లాడుకుందామంటూ పాతకందుకూరులోని గోపిరెడ్డి గోడౌన్‌ సమీపంలోని పంటకాలువ వద్దకు తీసుకెళ్లి పిడబాకులతో పొడిచి హత్య చేశారు. అనంతరం కాలువలో పడేసి వెళ్లారు. 

కేసును ఛేదించింది ఇలా..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అంతలోనే ఉయ్యాలవాడకు చెందిన బడే మస్తాన్‌ పోలీసులకు లొంగిపోయాడు. చంద్రమౌళి, నాగరాజు తనకు రూ.20 వేలు ఇచ్చి శ్రీనివాసులు ఆచారిని బెదిరించాలని చెప్పారని, తాను అంగీకరించకపోవడంతో వేరేవారితో కలిసి హత్యకు కుట్ర పన్నారని, ఆ విషయం తనకు తెలియడంతో తనను కూడా హత్య చేసుకు ఇరికిస్తారేమోనని ముందుగానే లొంగిపోతున్నానని పోలీసులకు చెప్పాడు. దీంతో నిందితులపై పోలీసులు నిఘా ఉంచారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉండగా వలపన్ని అరెస్ట్‌ చేశారు. కేçసును 10 రోజుల్లోనే ఛేదించినందుకు పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్‌ సీఐ సుదర్శనప్రసాద్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు