పెళ్లి వద్దన్నందుకు వితంతువుపై యాసిడ్‌ దాడి

19 Jan, 2019 11:09 IST|Sakshi

నిందితుడి ఆత్మహత్య

సాక్షి ప్రతినిధి, చెన్నై: భర్త మరణించగా ఇద్దరు పిల్లలతో ఒంటిచేతిపై జీవితాన్ని నెట్టుకొస్తున్న వితంతువుకు అండగా నిలిచాడు. ప్రేమ, పెళ్లి అంటూ ఒత్తిడి చేశాడు. నో చెప్పిందన్న కసితో ఆమెపై ఏకంగా యాసిడ్‌ కుమ్మరించాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. కన్యాకుమారి జిల్లా తిరువట్టార్‌కు చెందిన మణికంఠన్‌ (47), గిరిజ (39) దంపతులకు మహిషమోల్‌ (14), అక్మిమోల్‌ (12) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మణికంఠన్‌ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో గిరిజకు అదే ప్రాంతానికి చెందిన జాన్‌రోస్‌ (29) అనే భవన నిర్మాణ కార్మికునితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమేణా వివాహేతర సంబంధానికి దారితీసింది. పిల్లలతో ఒంటరిగా ఉన్న గిరిజకు జాన్‌రోస్‌ అన్నివిధాల అండగా నిలిచేవాడు.  అనారోగ్యకారణాలతో మణికంఠన్‌ తొమ్మిదేళ్ల క్రితం మరణించాడు. ఈ క్రమంలో ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు.

మనిద్దరం పెళ్లి చేసుకుందామని జాన్‌రోస్‌ తరచూ గిరిజపై ఒత్తిడితెచ్చేవాడు. అయితే తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నందున రెండో వివాహం ఇష్టం లేదని ఆమె నిరాకరించింది. ఇందుకు కోపగించుకున్న జాన్‌రోస్‌ గత ఏడాది ఏప్రిల్‌లో గిరిజపై తీవ్రంగా దాడిచేయడంతో పోలీసు కేసు పెట్టింది. ఈ కారణంగా గిరిజకు కొన్నాళ్లు దూరంగా ఉన్న జాన్‌రోస్‌ ఇటీవల మరలా ఇంటికి వస్తూ పెళ్లికి పట్టుబట్టగా ఆమె ససేమిరా అంది. తన ప్రేమను నిరాకరించిందని ఆమెపై కసిపెంచుకున్న జాన్‌రోస్‌ గురువారం రాత్రి 7.30 గంటలకు గిరిజ ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావనతేగా ఆమె బైటకు గెంటివేసింది. దీంతో మండిపడిన జాన్‌రోస్‌ తన వెంటతెచ్చుకున్న యాసిడ్‌ను ముఖం, ఒంటిపై కుమ్మరించాడు. యాసిడ్‌ బాధను తట్టుకోలేక ఆమె విలవిలలాడుతుండగా పరిసరాల ప్రజలు వచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె రెండుకళ్లు చూపు కోల్పోయినట్లు సమాచారం. కాగా, నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా అక్కడికి సమీపంలోని ఒక తోటలో విషం తాగి పడి ఉన్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న జాన్‌రోస్‌ ను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు.

మరిన్ని వార్తలు