తండ్రిపై నటి వనిత ఫిర్యాదు

22 Sep, 2018 09:44 IST|Sakshi
నటి వనిత

చెన్నై, పెరంబూరు: నటుడు విజయకుమార్‌ కూతురు, నటి వనిత పరారయ్యింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన ఇంటిని అక్రమించుకునే ప్రయత్నం చేసిందని, కిరాయి మనుషులతో బెదిరించిందని ఆమె తండ్రి ఆదివారం మధురవాయిల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలపాక్కం, అష్టలక్ష్మి నగర్‌లోని విజయకుమార్‌ ఇంటికి వచ్చి నటి వనితను విచారించిన విషయం తెలిసిందే. కాగా ఇంట్లో భాగం ఉంది.. ఇల్లు ఖాళీ చేయనని నటి వనిత పోలీసులతో వాగ్వాదం చేసింది. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై అనిత అనుచరులు దాడి చేశారు. గురువారం మధ్యాహ్నం పో లీసులు మరోసారి నటి వనితను విచారించడానికి అష్టలక్ష్మీ నగర్‌కు వెళ్లారు. పోలీసులతో ఆమె ఇల్లు ఖాళీ చేయనని తెలిపింది. అనుచరులతో కలిసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి నానా హంగా మా చేసింది. పోలీసుల పైనా దాడి చేయడంతో కేసు నమోదు చేసి వనిత, ఆమె అనుచరులు 7 మందిని అరెస్ట్‌ చేశారు. కాగా వారిలో నటి వనిత పరారైంది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

అమ్మ ఇంట్లోనే ఉన్నా..
కాగా పరారైన నటి వనిత గురువారం రాత్రి వడపళనిలోని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి విజయకుమార్‌పై ఫిర్యాదు చేసింది. అందులో తండ్రి కిరాయి మనుషులతో తనను కొట్టిస్తున్నాడని, ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించింది. అనంతరం వనిత విలేకరులతో మాట్లాడుతూ తాను తన తల్లి ఇంట్లోనే ఉన్నానని చెప్పింది. విజయకుమార్‌ తనను ఇంట్లో ఉండరాదంటున్నాడని తెలిపింది. వెంటనే ఇల్లు ఖాళీ చేయించా ల్సిందిగా మధురవాయిల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడంది. సినిమా వాళ్లకు బయట ఇల్లు అద్దెకు ఎవరూ ఇవ్వడం లేదని, అలాంటిది తాను ఎక్కడ ఉండాలని ప్రశ్నించింది. అందుకే అమ్మ ఇంటికి వచ్చానని చెప్పింది. సినిమాల్లో, టీవీ.సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్న తన తండ్రి విజయకుమార్‌ తనను మాత్రం కూతురని కూడా చూడకుండా అర్ధరాత్రి బయటకు గెంటించేశాడని ఇదేమి న్యాయం అని వాపోయింది. 

మరిన్ని వార్తలు