వీళ్లూ మనుషులు కాదు మృగాళ్లు..

23 Jun, 2019 13:05 IST|Sakshi

పట్టుమని పదినెలలు కూడా లేని చిన్నారి. తన చిరునవ్వులతో ఇంటిల్లిపాదిని అలరించేది. ఒక్కక్షణం కూడా ఆ బంగారుతల్లిని విడిచి ఉండలేం.. అలాంటి ముద్దులొలికే చిట్టితల్లి ఓ రాక్షసుడి చేతిలో బలైంది. తల్లిపక్కన వెచ్చగా ఒదిగి పడుకున్న బంగారుతల్లిని ఎత్తుకెళ్లిన కిరాతకుడు మాటల్లో చెప్పలేని విధంగా మట్టుబెట్టాడు. వరంగల్‌లో జరిగిన చిన్నారి ఘటన జిల్లావాసులనూ కంటతడి పెట్టించింది. సరిగ్గా ఏడాదిక్రితం జిల్లాలోని సోన్‌లో ఓ చిట్టితల్లిపై జరిగిన దారుణాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. 

నిర్మల్‌: ఈ మధ్య వరుసగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై సమాజం కలతచెందుతోంది. ‘అసలు వీళ్లు మనుషులేనా.. వీరికి మానవత్వం లేదా..’ అంటూ నిందితులపై ఆక్రోషం వెల్లగక్కుతోంది. సోషల్‌ మీడియా వేదికగా కారకులను అంతే కిరాతకంగా శిక్షించాలంటూ తమలోని ఆక్రందనను వ్యక్తంచేస్తోంది. మరోవైపు స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన యువత అశ్లీల చిత్రాలను చూస్తూ.. కన్నుమిన్ను కానకుండా కామాంధులుగా తయారవుతున్నారని ఆందోళన చెందుతోంది.

జిల్లాలో ఏడాదిక్రితం.. 
బడికి సెలవొచ్చిందని.. తన స్నేహితురాలి ఇంటికి ఆడుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి ఓ మృగాడి బారిన పడింది.  తన స్నేహితురాలి మామ కావడంతో తానూ ‘మామా..’ అనే ప్రేమగా పిలిచింది. కానీ.. ఆ దుర్మార్గుడు అప్పటికే అశ్లీల దృశ్యాలు చూడటానికి బానిసయ్యాడు. వాటి ప్రభావంతో మృగాడిగా మారాడు. చిన్నారి అని కూడా చూడకుండా పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తన గురించి ఎక్కడ చెబుతుందోనని ఇటుక రాయితో ముఖంపై దాడిచేసి, దారుణంగా చంపేశాడు. ఇదంతా గతేడాది ఇదేనెల 16న సోన్‌ మండల కేంద్రంలో జరిగిన ఘటన. తమ ముందు ఆడుతూపాడుతూ తిరిగిన చిన్నితల్లి విగతజీవిగా మారడంతో సోన్‌ ఊరంతా ఆరోజు ఆగ్రహంతో ఊగిపోయింది.
 
గతంలో పలు ఘటనలు.. 
జిల్లాలోనూ గతంలో అభంశుభం తెలియని చిన్నారులపై లైంగికదాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. వావివరసలు లేకుండా.. తాత వయసున్న ‘మృగాడు’ ఓ చిన్నారిపై అఘాయిత్యం చేశాడు. గత ఏప్రిల్‌ 7న సోన్‌ మండలకేంద్రంలోనే ఎనిమిదేండ్ల బాలికపై యాభయ్యేళ్ల వృద్ధుడు బాలయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు.  రాత్రిపూట ఇంట్లో అందరూ పెళ్లి సందడిలో ఉండగా చిన్నారిపై అఘాయిత్యం చేశాడు. చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పడంతో నమ్మి వచ్చిన చిన్నారికి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి.

రెండేళ్ల కిందట లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్‌లో రెండున్నరేళ్ల చిన్నారిపై సతీశ్‌ అనే యువకుడు లైంగికదాడికి యత్నించాడు. 2014 ఆగస్టులో సారంగపూర్‌ మండలంలోని ధనిలో శ్రీకాంత్‌ అనే యువకుడు ఆరేళ్ల్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతేడాది దిలావర్‌పూర్‌ మండలకేంద్రంలో ఓ కిరాణ దుకాణాన్ని నడిపించే వ్యక్తి కుమారుడైన బాలుడు ఓ చిన్నారిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. ఊరికి పెద్దగా.. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకోవాల్సిన వాళ్లే నయవంచకులుగా మారిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. ఓ ఆడపిల్ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని లక్ష్మణచాంద మండలంలో ఓ సర్పంచ్‌ లైంగిక దాడికి పాల్పడి జైలుకు వెళ్లాడు. ఇక లోకేశ్వరం మండలానికి చెందిన ఓ నాయకుడు తనకు సహకరించని యువతులపై వేధింపులకు దిగాడు.


యువతులు, మహిళలపై వేధింపులు 
జిల్లాలో చిన్నారులతో పాటు యువతులు, మహిళలు, ఉద్యోగినులపై వేధింపులు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి చదువుకోవడానికి, ఉపాధి కోసం వస్తున్న యువతులే లక్ష్యంగా జిల్లాకేంద్రంలో వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా బస్టాండ్‌ ప్రాంతంలో మహిళలు, యువతులతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. సైగలు చేస్తూ.. వేధిస్తున్న ఘటనలు చాలాసార్లు బయటపడ్డాయి. బతుకుదెరువు కోసం దుకాణాల్లో పనిచేస్తున్న యువతులతోనూ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కళాశాలల్లో చదువులు చెప్పాల్సిన అధ్యాపకుల్లోనూ కొందరు మృగాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాకేంద్రంలోని ఓ కళాశాలలో, ఓ పాఠశాలలో గతేడాది జరిగిన ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేశాయి. ఒకట్రెండు శాఖల్లో మృగాళ్ల చేష్టలు భరించలేక ఉద్యోగం మానేయడం, బదిలీ చేయించుకోవడం వంటివీ జరిగాయి. చాలామంది పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. మళ్లీ తమ పరువే పోతుందన్న భయంతో బయటకు రావడం లేదు.

షీటీమ్‌లు ఎక్కడ? 
మహిళలపై ఈవ్‌టీజింగ్, దాడులను నిరోధించడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖ షీటీమ్‌లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇవి జిల్లాకేంద్రానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఇందులోనూ సరిపడా సిబ్బంది లేకపోవడంతో అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. తరచూ విద్యార్థినులు, యువతులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాల్సి ఉన్నా.. అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమైనందున కళాశాలలు, విద్యాలయాల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

సఖీ కేంద్రాన్ని సంప్రదించాలి
మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరం. ఇలాంటి ఘటనల్లోని బాధితులు నేరుగా సఖి కేంద్రాన్ని సంప్రదించవచ్చు. చాలామంది పోలీసుల వద్దకు వెళ్లి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా మహిళల స్వేచ్ఛ, హక్కులు, రక్షణ కోసం సఖి కేంద్రం కృషిచేస్తుంది. సమస్యను నేరుగా చెప్పడానికి ఇబ్బంది పడేవారు టోల్‌ ఫ్రీ నంబర్‌ 181 లేదా సఖి కేంద్రం 85005 40181 నంబరులో సంప్రదించవచ్చు. – మమత, సఖీ కేంద్రం నిర్వాహకురాలు,నిర్మల్‌   

మరిన్ని వార్తలు