రెండు గంటల్లో తల్లి ఒడికి..

11 Jul, 2018 13:11 IST|Sakshi
శిశువు దొరకడంతో తల్లి, కుటుంబ సభ్యులు ఆనంద భాష్పాలు

ఆదిలాబాద్‌: మగశిశువు జన్మించడం ఆ దంపతుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆరు రోజులు గడిచాయి.. మంగళవారం డిశ్చార్జి కావాల్సి ఉంది. వేకువజామున తల్లి ఒడిలో వెచ్చగా నిద్రిస్తున్న శిశువు ఒక్కసారిగా మాయమైంది. స్పృహలోకి వచ్చి చూసిన తల్లిదండ్రుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. తమ కుమారుడు కిడ్నాప్‌కు గురి కావడం వారిని ఆందోళ నకు గురి చేసింది. ఈ విషయమై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు క్షణాల్లో స్పందించారు. రెండు గంటల వ్యవధిలో కిడ్నాప్‌కు గురైన శిశువును తల్లి ఒడికి చేర్చారు. నిందితులను కటకటాల వెనక్కి పంపారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించింది.

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం చోరపల్లి గ్రామానికి చెందిన దిరబసి గణేష్‌ భార్య మమత ఆరు రోజుల క్రితం రిమ్స్‌ ఆస్పత్రిలోని కేసీఆర్‌ కిట్‌ వార్డులో మగశిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉండగా.. వేకువజామున శిశువు కిడ్నాప్‌కు గురైంది. తల్లి స్పృహలోకి రాగా రిమ్స్‌ అధికారులకు సమాచారం అందించింది. వారి సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
 
చిన్నగుడ్డతో నిందితురాలిని     గుర్తించిన పోలీసులు..
∙ మంగళవారం వేకువజామున 3గంటల సమయంలో శిశువు కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 
∙ 3.15 గంటలకు రిమ్స్‌ సిబ్బంది ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. వారు 3.20 గంటలకు పోలీసు కంట్రోల్‌ రూంకు ఫోన్‌చేసి విషయం తెలియజేశారు. 
∙ 3.45 గంటలకు ఆదిలాబాద్‌ డీఎస్పీ నర్సింహారెడ్డి, టూటౌన్‌ సీఐ స్వామి రిమ్స్‌కు చేరుకున్నారు. సంఘటన వివరాలను 3.55 గంటలకు ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌కు తెలియజేశారు. 
∙ ఎస్పీ వెంటనే కంట్రోల్‌రూం అధికారులతో మాట్లాడి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆయా మండలాల ఎస్సైలను అలర్ట్‌ చేయాలని, వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.


∙ 4.10 గంటలకు నేరడిగొండ, బోథ్, ఉట్నూర్, బోరజ్, తలమడుగు మండలాల పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. 
∙ 5 గంటల సమయంలో నేరడిగొండ టోల్‌ప్లాజా వద్ద ఎస్సై జి.హరిశేఖర్‌ తనిఖీలు చేస్తుండగా బొలేరో వాహనంలో శిశువును ఎత్తుకుని ఉన్న పుష్పలతను గమనించి వివరాలు అడిగారు. ఆమె తడబడడం, రిమ్స్‌ నుంచి తెచ్చానంటూ చెప్పడంతో ఎస్సై ఆదిలాబాద్‌ డీఎస్పీ నర్సింహారెడ్డికి సమాచారం అందించారు. ఆమె వద్ద ఉన్న శిశువు ఫొటోలు తీసి వాట్సప్‌ ద్వారా పంపించారు. 
∙ 5.10 గంటలకు ఆ ఫొటోలను డీఎస్పీ బాధిత తల్లిదండ్రులకు చూపించగా శిశువుపై ఉన్న గుడ్డ ఆధారంగాతమ కొడుకుగా గుర్తించారు. వెంటనే శిశువుతో పాటు సదరు మహిళను ఎస్సై రిమ్స్‌కు తరలించారు. పుష్పలత వాహనం వెనుకాల మరో వాహనంలో వస్తున్న ఆమె భర్త నగేష్‌ సైతం నేరడిగొండలో పుష్పలత వద్దకు రావడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. 
∙ 5.30 గంటలకు శిశువును రిమ్స్‌కు తీసుకొచ్చారు. 6.30 గంటలకు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ శిశువును తల్లిదండ్రులకు అందజేశారు. 
∙ నిందితులను ఆదిలాబాద్‌ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన పుష్పలత, సోయం నగేష్‌లుగా గుర్తించినట్లు ఆదిలాబాద్‌ ఏఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి వెల్లడించారు. 
∙ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి శిశువు కిడ్నాప్‌ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ అభినందించారు.
 
రిమ్స్‌లో అంతా  తెలియడంతోనే కిడ్నాప్‌ ఈజీ.. 
పసికందును కిడ్నాప్‌ చేసిన దంపతులు అంతకుముందు రిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేశారు. గతంలో పుష్పలత రిమ్స్‌లో ఏఎన్‌ఎం శిక్షణ పొందగా.. ఆమె భర్త నగేష్‌ ఫుడ్‌స్టోర్‌లో వర్కర్‌గా పనిచేశాడు. దీంతో రిమ్స్‌లో ఏ మూలన ఏం ఉంటుందనేది వీరికి స్పష్టంగా తెలియడంతో పసికందును కిడ్నాప్‌ చాకచక్యంగా చేశారు. రిమ్స్‌లోని రెండు ప్రధాన ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఉండడంతో అటుగా వెళ్లకుండా దొడ్డిదారిన తీసుకెళ్లారు. డెలివరీ వార్డులో ఎవరికి అనుమానం రాకుండా పసికందును బయటకు తీసుకొచ్చి సీసీ కెమెరాలు లేని వార్డు నుంచి రేడియాలజీ విభాగం లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న చిన్న గేట్‌ తెరిచి ఉండడంతో ఆ గేట్‌ వెనుకాల నుంచి ఆస్పత్రి బయటకు వచ్చారు.

నేరుగా పాత ఆస్పత్రి ముందు నుంచి బస్టాండ్‌కు వెళ్లి అక్కడి నుంచి బొలెరో వాహనంలో బయల్దేరారు. నేరడిగొండ ప్రాంతంలో అప్పటికే పోలీసులు తనిఖీలు చేపట్టడంతో వారికి చిక్కారు. వీరిది ఆదిలాబాద్‌ కాగా.. నిర్మల్‌ వైపు తీసుకెళ్లడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ తనకు పిల్లలు లేరని అందుకే తీసుకెళ్లానని చెబుతున్నా.. నమ్మశక్యంగా లేదు. శిశును ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి విక్రయించే అవకాశాలు లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సీసీ కెమెరాలు పని  చేయకపోవడంతోనే.. 
కిడ్నాప్‌ వివరాలు తెలుసుకునేందుకు ఎస్పీ రిమ్స్‌లోని వార్డుల్లో తిరిగారు. ముందుగా సీసీ కెమెరాల పనితీరును తెలుసుకునేందుకు సీసీటీవీ గదిలో కెమెరాల రికార్డులు పరిశీలించారు. ఏయే వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయో.. వాటి పనితీరు ఎలా ఉందని రిమ్స్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిశువు కిడ్నాప్‌కు గురైన వార్డును సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. శిశువును ఎత్తుకెళ్లిన రూట్లను పరిశీలించారు. రేడియాలజీ విభాగం నుంచి బయట గేటు వరకు వెళ్లారు. కిడ్నాపైన వార్డు నుంచి బయట గేటు వరకు ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో కిడ్నాపర్‌లకు పని సులువైందని గుర్తించారు.
 
భద్రతా సిబ్బందిపై చర్యలు 
శిశువు కిడ్నాప్‌ సమయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. సెక్యూరిటీ గార్డు అలర్ట్‌గా లేకపోవడంతోనే ఇలా జరిగిందని రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌కు తెలిపారు. త్వరలో సెక్యూరిటీ గార్డులతోపాటు మిగతా సిబ్బందితో డీఎస్పీ, డైరెక్టర్‌లు సమావేశమై భద్రతాపరమైన విషయాలపై చర్చించాలని ఎస్పీ పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇందు కోసం పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు