భర్తకు జీవితఖైదు

2 Aug, 2018 09:30 IST|Sakshi

గుత్తి: వివాహిత ఆత్మహత్యకు కారకులైన భర్తకు జీవిత ఖైదు, అత్తమామలకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుత్తి ఏడీజే కోర్టు జడ్జి కమలాదేవి బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి వన్‌టౌన్‌ ఎస్‌ఐ యు.వెంకటప్రసాద్, ప్రాసిక్యూషన్‌ తరపున న్యాయవాది మహేష్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు బెంచికొట్టాలకు చెందిన ఎం.కిరణ్‌కుమార్‌కు వికారాబాద్‌ రైల్వే ఉద్యోగి సుభాష్‌ కుమార్తె లక్ష్మీరాజ్యంతో 2010లో వివాహం జరిగింది. వరుడికి కట్నకానుకల కింద 15 తులాల బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదు, రూ. లక్ష విలువ చేసే ఇంటి సామగ్రిని అందజేశారు.

పెళ్లి జరిగిన యేడాది నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. వీరి వేధింపులను భరించలేక 2016 మార్చి ఐదో తేదీన లక్ష్మీరాజ్యం గుంతకల్లు రైల్వేజంక్షన్‌లోని 5వ ఫ్లాట్‌ఫాంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. జీఆర్‌పీ పోలీసులు కేసునమోదు చేసుకుని, దర్యాప్తు కోసం అదే ఏడాది ఏప్రిల్‌ 16న ఒన్‌టౌన్‌ పోలీసులకు కేసు బదిలీ చేశారు. అప్పటి డీఎస్పీ సీహెచ్‌.రవికుమార్‌ కేసును దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన గుత్తి ఆరవ అదనపు కోర్టు నేరం రుజువు కావడంతో కేసులో ఏ1గా ఉన్న భర్త కిరణ్‌కుమార్‌కు జీవితఖైదు, ఏ2, ఏ3లుగా ఉన్న అత్త,మామ రాధాబాయి, గోవిందరాజులుకు ఏడేళ్ల జైలు, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.   

= అత్త, మామలకు ఏడేళ్ల జైలుశిక్ష  
=

మరిన్ని వార్తలు