భారత్‌లో బాలుడి హత్యకు లండన్‌లో కుట్ర!

15 Feb, 2020 15:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గోపాల్‌ సజానిని రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లి పోయింది. అప్పటికే తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. సమీపంలో ఉండే అక్క వరుసయ్యే ఆల్ఫా కర్దాని జాలి తలిచి ఆ అబ్బాయిని చేరదీసింది. రెండంటే రెండే గదులుగల చిన్న ఇంట్లో గోపాల్‌ సహా తొమ్మిది మంది ఉండేవారు. గోపాల్‌ ఇంట్లో అన్ని పనులు చేయడంతోపాటు తోటి పిల్లలతోని దొంగా, పోలీసు ఆట ఆడుతూ పెరిగాడు. పెద్దయ్యాక బాలీవుడ్‌ చిత్రంలోలాగా ‘బాజీరావ్‌ సింగం’ అవుతానని చెబుతూ వచ్చే వాడు. 

గుజరాత్‌ జిల్లాలోని జునాగౌడ్‌ జిల్లా, మాలియా హతీనా గ్రామీణ ప్రాంతంలో నివసించే  గోపాల్‌ అక్కడికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. 2017లో ఒక రోజు రాత్రి 9.30 గంటలకు రాంచీ నుంచి ఇంటికి కారులో తిరిగి వస్తుండగా, మోటారు సైకిళ్ల మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపాల్‌ను ఎత్తుకు పోయేందుకు ప్రయత్నించారు. పక్కనే తనతో వస్తోన్న అక్క అల్ఫా కర్దానీ భర్త, గోపాల్‌ను కాపాడేందుకు ప్రయత్నించగా, ఆగంతకులిద్దరు గోపాల్‌తో పాటు ఆయన్ని పొడిచారు. ఆగంతుకులకే కారు డ్రైవర్‌ సహకరించాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని రోడ్డు పక్కన పడేసి ఆగంతకులు వెళ్లి పోయారు. అల్ఫా కర్దాని భర్త అక్కడికక్కడే మరణించగా, గోపాల్‌ ఆస్పత్రిలో మరణించాడు. అప్పటికీ గోపాల్‌కు పదేళ్లు. 

ఈ హత్యపై దర్యాప్తు జరిపిన గుజరాత్‌ పోలీసులు హత్యకు మూలాలు లండన్‌లోని హాల్‌వెల్‌ నగరంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆర్తి ధీర్‌ అనే 55 ఏళ్ల మహిళ, ఆమె భర్త 31 ఏళ్ల కావల్‌ రాయ్‌జాడ కలిసి గోపాల్‌ హత్యకు కుట్రపన్నారు. 2013లో రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్లి చేసుకున్న వారు తమకు పిల్లలు లేరంటూ గోపాల్‌ను దత్తతు తీసుకుంటామంటూ 2014వో చివరిలో వారు ఊరు వెళ్లారు. గోపాల్‌ దత్తతకు అతని అక్కతోని, బావతోని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే ప్రాంతంలో కోపరేటివ్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న కావల్‌ తండ్రి సహకారంతో  ఈ ఒప్పందం కుదిరింది. 

2015, జూలై నెలలో లండన్‌ దంపతులకు గోపాల్‌ దత్తత పత్రాలు అందాయి. ఇద్దరు కలిసి ముంబై వచ్చి 2015, ఆగస్టు 26వ తేదీన గోపాల్‌ పేరిట ‘వెల్త్‌ బిల్డిర్‌’ అనే ప్రత్యేకమైన పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీకి మామూలుకన్నా పది రెట్లు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అక్కడ లక్షా యాభై వేల పౌండ్ల పాలసీ, అంటే దాదాపు కోటి నలభై లక్షల రూపాయల పాలసీని తీసుకున్నారు. వీసా వచ్చాక గోపాల్‌ను తీసుకెళతామని చెప్పి వెళ్లిన ఆ లండన్‌ దంపతులు తిరిగి 2017లో వచ్చి వీసా  ప్రాసెస్‌ కోసం అంటూ వచ్చి రాంచీకి గోపాల్‌ను కారులో తీసుకెళ్లి తిరిగి వస్తుండగా వారే కుట్ర పన్ని చంపించారు. గోపాల్‌ బతికి ఉంటే ఇప్పుడు అతనికి 13 ఏళ్లు ఉండేవి. వారు రెండు హత్యలు చేశారంటూ వెస్ట్‌ లండన్‌ హైకోర్టు గత జూలై నెలలోనే నిర్ధారించింది.

అయితే ఆ దోషులను తమకు అప్పగించాలంటూ భారత్‌ పెట్టుకున్న పిటిషన్‌ను అక్కడి హైకోర్టు నాలుగు రోజుల క్రితమే కొట్టివేసింది. రెండు హత్య కేసుల్లో వారికి ఎలాంటి పెరోల్‌ సదుపాయం కూడా లేకుండా యావజ్జీవ కారాగారా శిక్ష విధించే అవకాశం ఉందని, ఇది తమ పౌరులకు ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తున్న చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందంటూ భారత్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. దోషులను వదిలేశారు. వారు అక్కడ ప్రస్తుతం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తామెలాంటి నేరం చేయలేదని వారు ఇప్పటికీ వాదిస్తున్నారు. గోపాల్‌ది హత్య కేసుగా తేలడంతో ఎల్‌ఐసీ డబ్బులు కూడా వారికి అందలేదు.

ఈ విషయమై భారత్‌ జాతీయ మీడియా పోలీసు ఉన్నతాధికారులను సంప్రతించగా, అక్కడి హైకోర్టు నిర్ణయాన్ని పైకోర్టులో సవాల్‌ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఎప్పటికైనా గోపాల్‌ విషయంలో న్యాయం జరుగుతుందని, బ్రిటిష్‌ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గోపాల్‌ అక్కా అల్పా కర్దాని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానంతం నేరస్థులకు కూడా ప్రాథమిక హక్కులు వర్తించే విధంగా యురోపియిన్‌ యూనియన్‌ ఒడంబడిక మేరకు బ్రిటన్‌ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టాలను అడ్డు పెట్టుకొని బ్రిటన్‌ పౌరసత్వం కలిగిన భారతీయ ఆర్థిక నేరగాళ్లెందరో భారత్‌కు తీసుకరాకుండా తప్పించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు