పెట్రోల్, డీజిల్‌లో జోరుగా కల్తీ

30 Sep, 2019 10:20 IST|Sakshi
కల్తీ డీజిల్‌పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్న వినియోగదారులు (ఫైల్‌): డీజిల్‌ ట్యాంకుల్లో నీళ్లు ఉన్నట్లు గుర్తిస్తున్న ఇంధన కంపెనీ సేల్స్‌ అధికారి

ఇంధనం.. కల్తీమయం!

కొలతల్లో తేడాలు

ట్యాంకుల్లోకి చేరుతున్న నీళ్లు

పారదర్శకతకు పాతర

ఆందోళనలో వినియోగదారులు

ధనార్జనే లక్ష్యంగా.. కొందరు బంకు యజమానులు పెట్రోల్, డీజిల్‌ను కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటుండగా.. మరికొందరు నిబంధనలకు పాతరా వేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ కల్తీ పెట్రోల్, డీజిల్‌ వాడకంతో వాహనాలు మొరాయించడం.. వాటి లైఫ్‌ టైం తగ్గిపోవడంతోపాటు రిపేర్‌ చేయించేందుకు వెళ్తే షోరూంలలో రూ.వేలల్లో వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనే జడ్చర్ల సమీపంలోని పెట్రోల్‌ బంక్‌లో ఇటీవల చోటుచేసుకుంది.
 

సాక్షి, జడ్చర్ల: పెట్రోల్‌బంకుల్లో ఇంధన కల్తీతో వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ పోయించుకునే సమయంలో బండిలో పెట్రోల్‌ పడక ముందే గిర్రున మీటర్‌ తిరిగి 2 నుంచి 4పాయింట్లు చూయిస్తుండడం, వెంటనే రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని అడిగితే.. అదంతే దిక్కున్న చోట చెప్పుకోమంటు బంక్‌ సిబ్బంది అక్రోషం వెల్లగక్కుతున్నారు. ఇలా డీజిల్, పెట్రోల్‌బంకుల నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్న సంఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. ఆయా సంఘటనలపై ఫిర్యాదు చేసినా పట్టింపు లేక పోవడంతో కొద్ది సేపు అరిచి వెళ్లి పోవడం షరామామూలుగా మారింది. అంతేగాక ఎవరికి ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. ఇందుకు సంబందించి ఫిర్యాదు స్వీకరించే అదికారుల ఫోన్‌ నంబర్లు, తదితర సమాచారాన్ని పెద్ద ఆక్షరాలతో ప్రతి బంకువద్ద రాయిస్తే బాగుంటుందని వినియోగదారులు పేర్కొంటున్నారు.

మచ్చుకు కొన్ని..

  • బాదేపల్లికి చెందిన దస్తగీర్‌ తన ఫార్చునర్‌ వాహనంలో పట్టణంలోని ఓ పెట్రోల్‌బంక్‌లో డీజిల్‌ పోయించి కొద్ది దూరం వెళ్లేలోగా వాహనం నిలిచిపోయింది. మెకానిక్‌తో విచారిస్తే ట్యాంకులో డీజిల్‌కు బదులు నిండా నీరే ఉందని చెప్పాడు. డీజిల్‌ కొట్టించిన సమయంలో ట్యాంకులో చేరిన నీరే వాహనంలోకి పంపింగ్‌ అయ్యిందని తరువాత సదరు ఇంధన కంపెనీ సేల్స్‌ ఆఫీసర్‌ ధ్రువీకరించారు.  
  • మరో బంకులో ఓ వ్యక్తి తన వోక్స్‌వ్యాగెన్‌ పోలో కారులో డీజిల్‌ పోయించాడు. ట్యాంకు ఫుల్‌ చేయించిన తరువాత హైద్రాబాద్‌ వెళ్లి జడ్చర్లకు తిరిగి వస్తుండగా కొత్తూరు దాటిన తరువాత అకస్మికంగా కారు ఆగిపోయింది. దీంతో అతను కారు కంపెనీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుండి వచ్చిన మెకానిక్‌ తనిఖీ చేసి డీజిల్‌లో కిరోసిన్‌ కల్తీ జరగడం వలన నాజిల్స్‌ దెబ్బతిన్నాయని పేర్కొన్నాడు. నాజిల్స్‌ కొత్తవి అమర్చడానికి రూ:లక్ష దాకా ఖర్చవుతుందని బాదితుడు వాపోయాడు.
  • గంగాపూర్‌ రహదారిలో గల పెట్రోల్‌ బంకులో ఉదయాన్నే ఓ యువకుడు తన మోటార్‌ బైక్‌లో లీటర్‌ పెట్రోల్‌ పోయించాడు. అనంతరం బంకు దాటిండో లేడో  బండి ఆగిపోయింది. బైక్‌ ట్యాంకు ఓపెన్‌చేసి చూస్తే చుక్క పెట్రోల్‌ లేదు. అదేంటి ఇప్పుడే లీటర్‌ పోయించా గదా పెట్రోల్‌ రాలేదు ఏంటీ అని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని బుకాయింపు పైగా బెదిరింపు ధోరణి.

పారదర్శకతకు పాతర
ఇంధన విక్రయాలు పారదర్శకంగా  కొనసాగే విధంగా పర్యవేక్షించాల్సిన అధికారులు, కంపెనీ ప్రతినిధులు నిబంధనలకు నీళ్లొదిలి నిర్వాహకులతో కుమ్మక్కు కావడంతోనే కల్తీ పెట్రోల్, డీజిల్‌ విక్రయాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గత మూడేళ్ల క్రితం జడ్చర్ల జాతీయరహదారిని అనుసరించి నిర్వహిస్తున్న ఓ పెట్రోల్‌ బంక్‌లో ఏకంగా భూగర్భం ద్వార పైపులైన్‌ వేసి కిరోసిన్‌ను నింపుతుండగా విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి కిరోసిన్‌ కల్తీని వెలుగులోకి తీసుకువచ్చిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  

నిబంధనలు బేఖాతరు
పెట్రోల్‌ బంకుల్లో కనీస నిబంధనలు పాటించ డం లేదు. నిబంధనల మేరకు వినియోగదారులకు తాగు నీరు, మరుగుదొడ్లు, ఉచితంగా వా హనాల టైర్లకు గాలి సౌకర్యం, బిల్లులు ఇవ్వ డం, తదితర సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పా టు చేయాలి. అదేవిధంగా అగ్ని ప్రమాదాల నివారణకు గాను నీటి వసతి కోసం ఖచ్చితంగా బోరు ఉండాలి.  కొలతల్లో అనుమానాలను నివృత్తి చేసేందుకు వినియోగదారుల డిమాండ్‌ మేరకు 5లీటర్ల కొలత పాత్రలో ఇంధనం నింపి మాక్‌ టెస్టింగ్‌ చేసి చూపించాలి. అదేవిధంగా ప్రతి వాహనదారుడికి బిల్లులు ఇవ్వాలి. 

డీజిల్‌ ట్యాంకులో నీళ్లు
బంకుల్లో భూగర్భంలో ఇంధన నిల్వ కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో వివిధ కారణాలుగా నీళ్లు చేరే అవకాశం ఉంటుందని ఇంధన కంపెనీ అధికారులు ఈసందర్భంగా పేర్కొంటున్నారు. వాహనాల్లో ఇంధనం నింపే సమయంలో బంకులోని ట్యాంకర్ల అడుగు భాగంలో సబ్‌మెర్సిబుల్‌ మోటారు పంపు ఉండడంతో మొదటగా నీటినే లాగేస్తుంది. దీంతో వాహనాల్లోకి నీళ్లు చేరే అవకాశం ఉంటుందని ఇందన కంపెనీ సేల్స్‌ ఆఫీసర్‌ ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇదిలాఉండగా, ఇప్పటికైనా వినియోగదారులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం
పెట్రోల్, డీజిల్‌ బంకుల్లో అక్రమాలకు తావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే బంకుల్లో తనిఖీలు చేపడుతాం. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారిస్తున్నాం. జడ్చర్లలో ఓ బంకుపై వచ్చిన ఫిర్యాదుపై విచారించి వెంటనే ట్యాంకును శుభ్రం చేయించే విదంగా ఆదేశించాం.
– వనజాత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా