నూనె+వనస్పతి=నెయ్యి!

30 Aug, 2019 12:22 IST|Sakshi

చిలకలగూడ కేంద్రంగా కల్తీ నెయ్యి దందా

గుట్టురట్టు చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: నార్త్‌జోన్‌ పరిధి లోని చిలకలగూడ కేంద్రంగా సాగుతున్న కల్తీ నెయ్యి దందా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని 400 లీటర్ల కల్లీ నెయ్యి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. చిలకలగూడకు చెందిన పీఎన్‌ఎం నవీన్‌ నెయ్యి విక్రయం, డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం చేసేవాడు. «ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న అతను   ఏడాదిగా తన ఇంట్లోనే కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడు. మార్కెట్‌లో లభించే సాధారణ నూనెలో వనస్పతి కలిపి నెయ్యిగా మారుస్తున్నాడు. దీనిని డబ్బాలు, ప్యాకెట్లలో పార్శిల్‌ చేసి 100 శాతం స్వచ్ఛమైనదంటూ ప్రచారం చేస్తూ...కిరాణాదుకాణాలు, జనరల్‌ స్టోర్స్‌కు సరఫరా చేస్తున్నాడు.

ఇతడి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై టి.శ్రీధర్‌ తన బృందంతో రంగంలోకి దిగారు. నవీన్‌ ఇంటిపై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 24 డబ్బాల్లో పార్శిల్‌ చేసి 360 కేజీల, ప్యాకెట్ల రూపంలో ఉన్న 40 కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్యాకింగ్‌ మిషన్, సీలింగ్‌ యంత్రం, ప్లాస్టిక్‌ కవర్లు ఇతర మెటీరియల్‌ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు