కట్టడి లేని కల్తీ దందా

24 Jul, 2019 13:20 IST|Sakshi

గ్రేటర్‌లో ఆయిల్‌ మాఫియా

బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ కల్తీ

ఫిర్యాదులు పరీక్షలకే పరిమితం

కల్తీని నిర్ధారించని అధికారులు

సాక్షి,సిటీబ్యూరో: చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో ఇటీవల వాహనాల్లో పెట్రోల్‌ నింపుకుంటే సదరు వాహనాలు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయాయి. ఏం జరిగిందో పరీక్షించగా పెట్రోల్‌లో నీళ్లు కలిసినట్టు గుర్తించారు. దాంతో కొందరు వాహనదారులు వెనుదిరిగి వచ్చి ఆ బంకులో పెట్రోల్‌ను సీసాల్లో నింపి పరిశీలించగా బాటిల్‌ అడుగున నీరు కనిపించడంతో కల్తీని నిర్ధారించుకున్నారు. అంతకు ముందు పెట్రోలు పోయించుకున్న వాహనాలకు సైతం అదే సమస్య తలెత్తడంతో వారూ బంక్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇలాంటికల్తీ సంఘటనలు నగరంలో తరచూ బయటపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపడం తప్ప.. కల్తీ జరిగిందా.. లేదా.. కల్తీ తేలితే ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల కల్తీ ఆయిల్‌ మాఫీయా మహానగరంలో పాగా వేస్తున్నట్టు వస్తున్న అనుమానాలకు ఈ ఇంధన కల్తీ బలం చేకూరుస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకు ఎగబాగుతుండటంతో గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్‌ బంకుల్లో కల్తీ జరిగిపోతోంది. అధికారికంగా అయిల్‌ కంపెనీల నుంచి పది శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనం సరఫరా అవుతుండగా.. మరోవైపు అక్రమంగా ట్యాంకర్ల కొద్దీ టిన్నర్, నాఫ్తా, కిరోసిన్‌ కూడా పెట్రోల్‌ బంకులకు దిగుమవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో పెట్రోల్‌ బంక్‌ల్లో కల్తీ వ్యవహరానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం నాణ్యతపై తనిఖీ చేయాల్సిన పౌరసరఫరా శాఖాధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడంతో కల్తీ వ్యవహారం బంకుల ఇష్టారాజ్యమైంది.

నగరంలో యథేచ్చగా కల్తీ  
శివార్లోని బంకులు అధికంగా కల్తీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందుకు పలు సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. నిత్యం నగరానికి పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున ఇక్కడి పెట్రోల్‌ బంకులకు ఇంధన డిమాండ్‌ బాగానే ఉంటుంది. దీంతో వాటి యాజమాన్యాలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కారుచౌకగా బయోడిజిల్, కిరోసిన్, నాఫ్తా ఆయిల్‌ తెప్పించి కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ట్యాంకర్లు సిటీకి దిగుమతి అవుతున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్‌ పెట్రోల్‌ బంకులు æఆయిల్‌ కంపెనీల ప్రధాన యూనిట్లకు అనుసంధానమై ఉండడంతో ఇంధనంలో కల్తీ జరిగితే రీడింగ్, డెన్సిటీ ద్వారా బయటపడుతుంది. సాధారణంగా రోజుకు 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజీల్‌ విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్‌గా మారాలి. అయితే నగరంలోని బంకుల్లో సేల్స్‌ ఉన్నా.. కొన్ని పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్‌ బంక్‌లుగా మారకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

దెబ్బ తీస్తున్న ఇథనాల్‌ మిళితం
ఆయిల్‌ కంపెనీల నుంచి ఇథనాల్‌ కలిసిన పెట్రోల్‌ సరఫరా కూడా నిల్వలను దెబ్బతీస్తోంది. ఇథనాల్‌ మిళితమైన పెట్రోల్‌ నిల్వల్లో నీరు కలిస్తే క్రమంగా పెట్రోల్‌ నీరుగా మారుతుంది. చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్‌ బ్లెండింగ్‌ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీలే చెబుతున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్‌ ఆక్టేన్‌ సంఖ్య పెరుగుతుంది. ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. కానీ, చమురు సంస్థలు ఇవేమి పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు పదిశాతం ఇథనాల్‌ కలిపి సరఫరా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. 

శాంపిల్స్‌ సేకరిస్తున్నారా..?
పెట్రోల్‌ బంక్‌కు ట్యాంకర్‌ రాగానే ప్రత్యేకంగా శాంపిల్స్‌ తీసి ఇన్‌వాయిస్‌తో సహా భద్రపరచాలి. ఒకవేళ వినియోగదారుడు కల్తీ జరిగిందని అనుమానిస్తే బ్లాటింగ్‌ పేపర్, డెన్సిటీ పరీక్షలు చేయాలి. పరీక్షల్లో ఇన్‌వాయిస్‌ డెన్సిటీకి బంక్‌లోని పెట్రోల్‌ డెన్సిటీకి ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా కల్తీ జరిగినట్టే. ఒకవేళ ట్యాంకర్‌ శాంపిల్స్‌ భద్రపర్చలేదంటే ఆ బంకుల్లో కల్తీ జరుగుతున్నట్లు అనుమానించవచ్చు. కంపెనీ ఆయిల్‌ సరఫరా చేసే సమయంలోనే పెట్రోల్, డీజిల్‌ సాంధ్రత ఎంతుండాలనేది ధృవీకరిస్తారు. ఇలా పెట్రోల్‌లో డెన్సిటీ నిర్థారించే హైడ్రోమీటర్లు థర్మామీటర్‌తో కూడిన కిట్లను బంక్‌ యజమానులు అందుబాటులో ఉంంచాలి. వాస్తవంగా పెట్రో, డీజిల్‌లో కల్తీ నిర్థారించే  హైడ్రోమీటర్, థర్మామీటర్, జార్లతో కూడిన కిట్లు మెజార్టీ బంకుల్లో  కనిపించవు.

బంకుల్లో తనిఖీలు అంతంతే..
పెట్రోల్‌లో యథేచ్చగా కల్తీ జరుగుతోందని వినియోగదారులు గగ్గోలుపడుతున్నా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్‌ సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి  ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు ఉండాలి. అయితే, గ్రేటర్‌లో అధికారుల వద్ద అలాంటి పరికరాలు ఉండవు. పౌరసరఫరాల శాఖ తనిఖీలు చేసి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌ పరీక్షకు పంపించిన శాంపిల్స్‌ సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు. సదరు సంస్థ కూడా కల్తీ నిర్థారణ జరిగినట్లు నివేదికలు పంపించిన దఖాలాలు కూడా ఉండడం లేదు.  

కల్తీపై కఠిన చర్యలు
పెట్రోల్, డీజిల్‌ కల్తీ చేస్తే బంకులపై చర్యలు తప్పవు. కొన్ని బంకుల్లో ఇథనాల్‌ కారణంగా పెట్రోల్‌ నీరుగా మారుతుందని డీలర్లు చెబుతున్నారు. శాంపిల్స్‌ సైతం సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. కల్తీ బయటపడితే బంకులనే సీజ్‌ చేసి డీలర్లపై చర్యలు తీసుకుంటాం.– రాథోడ్, డీఎస్‌ఓ, రంగారెడ్డి జిల్లా

మరిన్ని వార్తలు