వివాహేతర సంబంధం..పెట్రోల్ పోసి...

29 Oct, 2018 08:42 IST|Sakshi
షమీనా (ఫైల్‌)

అతనో ఆర్‌ఎంపీ వైద్యుడు. పెళ్లి కూడా అయింది. క్లినిక్‌కు తరుచుగా వచ్చే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం యువతి బంధువులకు తెలియడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. చేసేది లేక ఆమెను రెండో భార్యగా చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో కుటుంబకలహాలు మొదలయ్యాయి. దీంతో అప్పుడప్పుడు కలుసుకుంటున్న మాదిరిగానే ఆదివారం కూడా రెండో భార్యను కలిశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. యువతి ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెడుతుండగా కర్రతో తలపై మోది అతికిరాతంగా చంపాడు. ఈ హృదయ విదారక సంఘటన ఆదివారం ఉదయం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో జరిగింది.

రామన్నపేట(నకిరేకల్‌) : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ షుకూర్‌ అనే వ్యక్తి రామన్నపేటకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహం అనంతరం కొండమల్లేపల్లిలోనే గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్‌ఎంపీగా ప్రాక్టిస్‌ చేస్తున్న సమయంలో గుంటూరుకు చెందిన షమీనా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తరచుగా క్లినిక్‌కు వస్తుండంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ విషయం షమీన బంధువులకు తెలియడంతో పెళ్లిచేసుకోవాలని షుకూర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో షుకూర్‌ ఆమెను 2017 ఏప్రిల్‌లో రెండో వివాహం చేసుకున్నాడు. విషయం మొదటి భార్యకు, ఆమె తల్లిదండ్రులకు తెలవడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి.మొదటి భార్య తరఫు బంధువుల ఒత్తిడి మేరకు షుకూర్‌ 5నెలల క్రితం తన మకాంను రామన్నపేటకు మార్చాడు. రామన్నపేట పాతబస్టాండ్‌ ఆవరణలో ఆయూస్‌ క్లినిక్‌ను తెరిచి వైద్య సేవలు అందిస్తున్నాడు. షుకూర్‌ రామన్నపేటకు వచ్చిన తర్వాత కూడా రెండో భార్యతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నాడు.

రెండు పర్యాయాలు ఆమె రామన్నపేటకు వచ్చి అతనిని కలిసి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం పదిగంటల సమయంలో షమీనా మండలంలోని ఇంద్రపాలనగరం శివారులోకి రాగా, షుకూర్‌ బైక్‌పై అక్కడికి వెళ్లాడు. రోడ్డుకు కొద్దిదూరంలో వ్యవసాయ బావి భూమిలోని చింతచెట్టుకు కింద కలుసుకున్నారు. ఆ సమయంలో వారి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. షుకూర్‌ తనవెంట తీసుకువచ్చిన బాటిల్‌లోని పెట్రోల్‌ను ఆమెపై చల్లి లైటర్‌తో నిప్పంటించాడు.

ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా తలపై కర్రతో బలంగా మోదడంతో అక్కడే కుప్పకూలిపోయింది. చుట్టు పక్కల రైతులు గమనించి మంటలను చూసి  అరుపులను విని పరుగెత్తుకుంటూ వచ్చి 108కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రథమచికిత్స అనంతరం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షమీనా మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న సీఐ ఎన్‌.శ్రీనివాస్, ఎస్‌ఐ బి.నాగన్నలు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు