కూరగాయల కత్తితో హత్యాయత్నం

5 Sep, 2019 11:32 IST|Sakshi
కత్తిపోట్లకు గురైన లక్ష్మి, గాయపడిన రాంబాబు

ఆపై తనూ ఆత్మహత్యాయత్నం

వివాహేతర సంబంధమే కారణం

సాక్షి, సరుబుజ్జిలి (శ్రీకాకుళం): ఇరువురికి వేర్వేరు వ్యక్తులతో వివాహమైంది. కూలీ పనుల కోసం వారి కుటుంబాలను విడిచి పెట్టి ఇతర ప్రాంతానికి వలస వెళ్లారు. అక్కడ ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆపై విభేదాలు తలెత్తగా.. తదుపరి హత్యాయత్నానికి ఉసిగొల్పింది. బుధవారం మండలంలోని కొత్తకోట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన అరసవల్లి లక్ష్మి(30)పై ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన సీ రాంబాబు(32) కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు.

ఎస్సై కే మహాలక్ష్మి వివరాల ప్రకారం... అరసవల్లి లక్ష్మికి తన దగ్గర బంధువు శ్రీనివాసరావుతో గతంలో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదేవిధంగా రాంబాబుకు వివాహమై కుమారుడు ఉన్నాడు. ఇరువురు తమ కుటుంబాలను విడిచి కూలీ పనులకు వెళ్లారు. మూడేళ్లుగా తిరుపతిలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. మరలా కొద్దిరోజుల తర్వాత ఫోన్ల ద్వారా సంబంధాలు పురుద్ధరించారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా తమ స్వంత గ్రామాలకు వచ్చారు.

దూరం పెడుతుందనే దాడి...
కొత్తకోట గ్రామంలో లక్ష్మి ఉన్నట్లు గ్రహించిన రాంబాబు వచ్చాడు. అప్పటికే పెరట్లో కూరగాయల మొక్కలకు కంచె కడుతున్న ఈమెతో వాగ్వాదం తలెత్తింది. ఫోన్‌ చేసినా స్పందించలేదన్న కోపంతో అతడు కూరగాయల కత్తితో పొట్టమీద పొడిచాడు. గాయాలతో లక్ష్మి వెంటనే కూలిపోవడంతో తను కూడా కత్తితో కోసుకొని బండరాయితో తలపై మోదుకుని నేలపై పడిపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా 108 వాహనంలో ఆమదాలవలస సమీప జొన్నవలస ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చారు. గాయపడిన లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

>
మరిన్ని వార్తలు