తల్లిదండ్రులు మందలించారని.. ఆత్మహత్య

4 Dec, 2019 08:34 IST|Sakshi
నరేష్‌కుమార్‌ మృతదేహం

గండిపేట చెరువులో మునిగి యువకుడి ఆత్మహత్య   

మూడు రోజుల తర్వాత నీళ్లపై తేలిన మృతదేహం

సాక్షి, చేవెళ్ల: ‘బీటెక్‌ చదివి ఖాళీగా తిరిగితే ఎలా..? ఏదైనా పనిచేయొచ్చు కదా’ అని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు గండిపేట చెరువులో మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల తర్వాత చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో మృతదేహం నీళ్లపై తేలడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మహేంద్రనాథ్‌ కథనం ప్రకారం.. గండిపేట మండల పరిధిలోని నార్సింగికి చెందిన పులకల నరేష్‌కుమార్‌(24) బీటెక్‌ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఖాళీగా తిరుగుతున్నాడు. ఏదైనా పని చేసుకుని కుటుంబానికి తోడుగా ఉండాలని తల్లిదండ్రుల ఇటీవల మందలించారు.

దీంతో మనస్తాపం చెందిన నరేష్‌కుమార్‌ గతనెల 30న స్కూటీ తీసుకుని ఇంట్లోంచి బయలుదేరాడు. రాత్రి అయినా అతడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు  చేశారు. ఈమేరకు మిస్సింగ్‌ కేసుగా పోలీసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో గండిపేట చెరువులో ఓ యువకుడి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ స్థానికులు కనిపించింది. సమాచారం అందుకున్న మొయినాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌  పరిధిలో మిస్సింగ్‌ అయిన నరేష్‌కుమార్‌గా గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

బాలాజీ దేవాలయానికి వచ్చి.. 
ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో గత నెల 30న స్కూటీ తీసుకుని బయలు దేరిన నరేష్‌కుమార్‌ చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చాడు. ఆలయం వద్ద పార్కింగ్‌లో స్కూటీ పెట్టి సమీపంలో ఉన్న గండిపేట చెరువు వద్దకు వెళ్లాడు. ఈనేపథ్యంలో అతడు నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నరేష్‌కుమార్‌ ఇంట్లో రాసిపెట్టిన సూసైట్‌నోట్‌ను నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు