మళ్లీ అదే తరహా కుట్ర..

16 Mar, 2019 04:29 IST|Sakshi

కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీని దెబ్బతీసే ఉద్దేశంతోనే వైఎస్‌ వివేకా హత్య 

ఈ వ్యవహారంలో పోలీసుల తొందరపాటు.. అధికారపక్షం కలవరపాటు 

జగన్‌పై హత్యాయత్నం నుంచి వైఎస్‌ వివేకా హత్య వరకు పోలీసుల తీరుపై విమర్శలు 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం నుంచి మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వరకు అధికార టీడీపీ, పోలీసుల తీరులో అదే తొందరపాటు, కలవరపాటు కనిపించింది. వివేకానందరెడ్డి హత్య అనంతరం పోలీసులు, రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించిన తీరును గమనించిన రాష్ట్ర ప్రజలు విశాఖలో వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రను గుర్తు చేసుకుంటున్నారు. గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో జగన్‌ను హత్య చేసేందుకు కత్తితో దాడి చేసిన ఘటన టీడీపీ ప్రభుత్వ పెద్దల కుట్రేననే అనుమానాలు వ్యక్తమవడం తెలిసిందే. అప్పట్లో డీజీపీ ఠాకూర్, సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డీజీపీ, సీఎంలు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరించారనే విమర్శలొచ్చాయి.

రాజకీయ కోణంలోనే జగన్‌మోహన్‌రెడ్డిని మట్టుబెట్టే ప్రయత్నం జరిగిందని, దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేయగా.. ప్రభుత్వం రాష్ట్ర పోలీసులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేయడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటిపై గాయాలు కనబడుతుంటే ఐపీసీ సెక్షన్‌ 302 (హత్య కేసు) కింద కేసు నమోదు చేయకుండా ఐపీసీ సెక్షన్‌ 174 (అనుమానస్పదం) కేసు అనడం ఏమిటనే అనుమానాలు తలెత్తాయి. చివరకు పోస్టుమార్టం అనంతరం వివేకానందరెడ్డి శరీరంపై ఏడు పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలున్నాయని నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చినట్టు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ప్రకటించారు. వివేకానందరెడ్డి తల వెనుక, నుదుటిపైన, తొడ, చేతిపైన గాయాలున్నట్టు గుర్తించారు. ఈ కేసులో తమకు కొన్ని క్లూస్‌ దొరికాయని, వేలిముద్రలు (ఫింగర్‌ ప్రింట్స్‌) సేకరించామని, వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఎస్పీ ప్రకటించారు.

‘ఉత్త’రాయుధం.. 
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం మొదలుకుని వివేకానందరెడ్డి హత్యలోనూ పోలీసుల దర్యాప్తులో బయటపెట్టిన ‘ఉత్త’రాయుధం (లెటర్‌)లపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు 11 పేజీల లేఖ రాసి జేబులో పెట్టుకున్నాడంటూ పోలీసులు అల్లిన కథ వాస్తవానికి విరుద్ధంగా ఉందనే విమర్శలొచ్చాయి. పథకం ప్రకారమే కేసును నీరుగార్చేందుకు ఇంటెలిజెన్స్‌ ఏడీజీ డైరెక్షన్‌లోనే లేఖను సృష్టించినట్టు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. తాజాగా వివేకానందరెడ్డి చనిపోతూ లెటర్‌ రాసినట్టు పోలీసులు చెప్పారు. కేసును నీరుగార్చేందుకే ఈ లేఖను సృష్టించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

రాజకీయ హత్యే.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ చేపడితే రాజకీయ కోణం వెలుగు చూస్తుందనే డిమాండ్‌ వినిపిస్తోంది. వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయం కోసం శక్తివంచనలేకుండా పనిచేస్తున్న వివేకానందరెడ్డి.. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. 

రాజారెడ్డి హంతకులకు క్షమాభిక్ష.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డిని దారుణంగా హత్య చేసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల క్షమాభిక్ష పెట్టింది.  ఆ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వారికి టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. విడుదలైన వారిలో ఉన్న సుధాకర్‌రెడ్డిని అనుమానిస్తున్నట్టు పోలీసు వర్గాలు లీకులిచ్చాయి. రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్‌రెడ్డి ముద్దాయిగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. రాజకీయ కోణంలో జరిగిన ఈ హత్యలో ప్రభుత్వ పెద్దలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వాస్తవాల్ని నిగ్గుతేల్చేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలనే డిమాండ్‌ బలంగా విన్పిస్తోంది. అప్పుడే వివేకానందరెడ్డిపై దాడి చేసి హత్య చేసిన కుట్రలో నిందితులెవరు? దాని వెనుక ఉన్నది ఎవరు? చేసిందెవరు? తదితర విషయాలు వెలుగుచూస్తాయని ప్రజలు భావిస్తున్నారు. 

మంత్రి ఆది తీరుపై సందేహాలు..   
వివేకా హత్య విషయంలో అదే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించిన తీరును ప్రజలు తప్పుబడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తనపై ఆరోపణలు, అనుమానాలు వస్తున్నాయని ఖండించుకోవడం గమనార్హం. వివేకా హత్య విషయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులు తొలుత అనుమానాస్పద మృతి అని ప్రకటించి నాలుక కరుచుకుని హత్య కేసుగా మార్పుచేశారు. 

మరిన్ని వార్తలు