మనస్తాపంతో అగ్రికల్చర్‌ విద్యార్థి ఆత్మహత్య

28 Apr, 2019 10:10 IST|Sakshi
ఆస్పత్రిలో వివేక్‌కుమార్‌ మృతదేహం

ప్రేమ విఫలం కావడం వల్లే అంటున్న కుటుంబ సభ్యులు

శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

పాతపట్నం: స్థానిక శివశంకర్‌ కాలనీ మెయిన్‌ రోడ్డులో అద్దెకు ఉంటున్న బీఎస్సీ అగ్రికల్చర్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి బిడ్డక వివేక్‌కుమార్‌ (23) మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. పోలీసులు తెలపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని సెంచురీయన్‌ యూనివర్సిటీ (పర్లాకిమిడి)లో వివేక్‌కుమార్‌ అగ్రికల్చర్‌ ఫైనల్‌ సంవత్సరం చదువుతున్నాడు. ఏడాదిగా పాతపట్నం శివశంకర్‌ కాలనీ మొదటి లైన్‌ రోడ్డులో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారకస్థితిలో ఉన్న వివేక్‌ కుమార్‌ను స్థానికులు గుర్తించారు.

చికిత్స కోసం ఆటోలో పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పోందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రిమ్స్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వివేక్‌కుమార్‌ స్వస్థలం విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పుట్టజమ్ము గ్రామం. తమ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేయమని అడిగాడని తండ్రి సుకుమార్‌కు చెప్పారు. ఆ అమ్మాయి ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అంటున్నారు. వివేక్‌కుమార్‌ తండ్రి సుకుమార్‌ కడపలో ఆంధ్ర జాగృతి బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు