గమ్యం చేరకుండానే..

20 Jun, 2019 08:35 IST|Sakshi

సాక్షి, మందస(శ్రీకాకుళం) : ఖరీఫ్‌ విత్తనాలు అందించే సమయం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో మంగళవారం సాయంత్రం 7.30 గంటల వరకూ విధులు నిర్వహించి, బుధవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి, తిరిగి పలాసలోని కార్యాలయానికి రావాలన్న ఆత్రుత ఆ అధికారిని అనంత లోకాలకు తీసుకెళ్లింది. ఆగి ఉన్న లారీని పలాస వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు చల్లా దశరథుడు(52) కారు ఢీకొనడంతో మృతి చెందారు. కంచిలిలో నివాసముంటున్న ఈయన తానే డ్రైవింగ్‌ చేసుకుంటూ కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో మందస మండలం బిన్నళమదనపురం సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న (ఏపీ 26 టీఎఫ్‌ 6461) లారీని తెల్లవారుజామున 5.15 గంటలకు ప్రమాదవశాత్తూ వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు.

ఈ ప్రమాదంలో ఆయన గుండెకు, తలకు బలమైన గాయాలయ్యాయి. అక్కడే కొంతమంది కారులో నుంచి బయటకు తీసి, మందస 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే మాట్లాడిన ఏడీ కొద్దిసేపటికే స్పృహతప్పి, కోమాలోకి వెళ్లిపోయారు. ఈ తరుణంలో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాద స్థలాన్ని మందస ఎస్‌ఐ వానపల్లి నాగరాజు, కానిస్టేబుల్‌ రామ్మోహన్‌ పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మీకనకవల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దశరథుడుకి భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. మరికొద్ది సమయంలో ఇంటికి చేరుకుంటారని భావించిన కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త చేరడంతో గుండెలవిసేలా రోదించారు. ఏడీ మరణంతో మందస, పలాస వ్యవసాయ కార్యాలయ అధికారులు, సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిగా, అందరితో స్నేహంగా మెలిగారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు