భార్యల పోషణ కోసం మోసం; నిందితుల అరెస్ట్‌

17 Oct, 2019 16:23 IST|Sakshi
నిందితులను అరెస్ట్‌ చేసిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల బృందం

భోపాల్‌: స్థానిక ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఎర వేసి మహిళలను మోసం చేసిన నిందితులను ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక ఎయిమ్స్‌ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఈ కేసును స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌కు అప్పగించారు. ఎస్‌టీఎస్‌ పోలీసులు కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు చేసి మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితుల ముఠాను పట్టుకుని అరెస్ట్‌ చేశారు.

ఎస్‌టీఎఫ్‌ ఏడీజీ అశోక్ అవస్థీ వివరాల ప్రకారం.. ఈ ముఠా భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నర్సుగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు సుమారు 50 మంది మహిళలను మోసం చేసినట్లు తెలిపారు. పట్టుబడిని ప్రధాన నిందితుడు దిల్షాద్ ఖాన్ జబల్పూర్‌ వాసి కాగా, సహచరుడు అలోక్‌ కుమార్‌ భోపాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దిల్షాద్ ఖాన్‌కు ఐదుగురు భార్యలు ఉన్నారని, భార్యలతో కుటుంబ పోషణ భారంగా మారటంతో ఇలాంటి మోసాలు పాల్పడుతున్నాడని వెల్లడించారు.

నిందితుడు దిల్షాన్‌.. తన భార్యల్లో ఒకరు జబల్‌పూర్‌లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారని, అలోక్ కుమార్ భార్య ప్రభుత్వ హాస్టల్‌లో సూపరింటెండెంట్‌గా పని చేస్తుందని పోలీసులకు వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలకు ప్రత్యక్షంగా ఈ కేసుతో సంబంధం లేకున్నా..  పరోక్ష పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుపుతామని అశోక్‌ అవస్థీ వెల్లడించారు. అదేవిధంగా ఈ ముఠా చేతిలో మోసపోయిన నగర, గ్రామీణ మహిళల వివరాలను తెలుకోవడానికి ఎస్‌టీఎఫ్‌ బృందం ప్రయత్నం చేస్తోందని తెలిపారు.  

మరిన్ని వార్తలు