ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

6 Sep, 2019 11:01 IST|Sakshi

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట

శంషాబాద్‌: ఉద్యోగం సంపాదించుకోవడంలో విఫలమైన  ఓ నిరుద్యోగి తానే ముఠా ఏర్పాటు చేసి పలువురు నిరుద్యోగులను మోసం చేసిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. గురువారం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు..  శ్రీకాకుళం జిల్లాకు చెందిన లోగిరి సంతోష్‌కుమార్‌ రెండేళ్ల క్రితం నగరంలోని ఓ ఏవియేషన్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఏడాది క్రితం ఎమిరెట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగానికి గాను ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉద్యోగం రాకపోవడంతో తనలాగే ఉద్యోగాల కోసం వచ్చి తిరస్కరణకు గురవుతున్న వారిని గుర్తించిన అతను  మోసాలకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టు మాజీ ఉద్యోగి మహంతి రాంకు మార్‌తో జత కలిశాడు. అనంతరం మల్టీమీడి యా నిపుణుడైన తన బావమరిది నారాయణతో కలిసి ఎమిరెట్స్‌ ఎయిర్‌లైన్స్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించుకున్నాడు.

వీరికి ఎల్బీస్టేడియం సమీపంలోని ఎయిర్‌వై ఏవియేషన్‌ అకాడమిలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ ఖాదిర్‌ జతకలిశాడు. నకిలీ ఐడీ కార్డులను కలర్‌ జిరాక్స్‌ తీయడం వంటి పనులకు మీర్‌పేట్‌కు చెందిన బూర్గుల పాండు సహకరించేవాడు. వీరు ఐదుగురు ఎయిర్‌పోర్టు సమీపంలోని తుక్కుగూడ వద్ద కార్యాలయం తెరిచారు. నిరుద్యోగులను అక్కడికే రప్పించి ఇంటర్వ్యూలు నిర్వహించి నకిలీ ఐడీ కార్డులతో పాటు నకిలీ ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాసులను కూడా తయారు చేసి ఇచ్చేవారు. ఇందుకుగాను ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవారు. గత ఆగస్టులో బార్కాస్‌కు చెందిన ఖాలిద్‌ మహ్మద్‌ ఖాన్‌ కూడా వీరి వద్ద ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అతడికి నకిలీ ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాస్‌ ఇచ్చారు. దీనిని గుర్తించిన ఖాలిద్‌ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీ సులు ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. ఐదు మొబైల్‌ ఫోన్‌లు, కంప్యూటర్, రెండు ల్యాప్‌టాప్‌లు, కారుతో పాటు నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదించడంలో కీలక పా త్ర పోషించిన ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ రామకృష్ణతో పాటు ఎస్సైలను డీసీపీ అభినందించారు. 

మరిన్ని వార్తలు