కత్తితో పొడిచి భార్యను చంపిన ప్రభుత్వ ఉద్యోగి

2 Jun, 2020 10:42 IST|Sakshi
భర్త సంజీవ్‌తో హత్యకు గురైన రాణి (ఫైల్‌)

కత్తితో పొడిచి చంపిన ప్రభుత్వ ఉద్యోగి

అమీర్‌పేట: జీతం మొత్తం మద్యం కోసమే ఖర్చు చేస్తున్నావు.. మద్యం తాగడం మానేయి అని అన్నందుకు  భార్యను అత్యంత దారుణంగా  హతమార్చాడో వ్యక్తి.  ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ స్టేట్‌ టీబీ కేంద్రం ఆవరణలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. మెదక్‌జిల్లా నారాయణ్‌ ఖేడ్‌కు చెందిన సంజీవ్‌తో  ఆర్‌సీపురానికి చెందిన రాణి (42)కి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంజీవ్‌ స్టేట్‌ టీబీ ట్రైనింగ్‌ సెంటర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. క్వార్టర్‌ నెం.1లో వీరు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహమైంది. సంజీవ్‌కు ప్రతి నెలా సుమారు రూ.70 వేల వరకు వేతనం వస్తోంది.

మద్యానికి అలవాడు పడ్డ ఆయన వచ్చిన వేతనంలో ఎక్కువ భాగం మద్యం కోసం ఖర్చు పెట్టేవాడు. స్నేహితులతో కలిసి విందులు, వినోదాలు చేసుకునేవాడు.ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కళాశాలలకు సెలవులు ఉండటంతో ఇద్దరు పిల్లలు ఆర్‌సీపురంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు.  రాత్రి ఎప్పటి లాగే  మద్యంతాగి వచ్చిన భర్తతో గొడవ పడింది. దీంతో సంజీవ్‌ భార్యను తీవ్రంగా కొట్టాడు. కొడుకు, కూతురుకు ఫోన్‌ చేసి మీ నాన్న తనను కొడుతున్నాడని చెప్పింది. ఆ తరువాత సంజీవ్‌.. భార్యను కత్తితో ఛాతిపై పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం పిల్లలలకు ఫోన్‌ చేసి చెప్పాడు. వారు ఎర్రగడ్డకు రాగా తండ్రి అక్కడికి వెళ్లి వారిని తీసుకుని ఇంటికి వచ్చాడు. లోపలకు వెళ్లి చూడగా తల్లి రక్తపు మడుగులో కనిపించింది. వారు అమ్మమ్మకు ఫోన్‌ చేయడంతో సంజీవ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరళించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు