మద్యానికి బానిసై చోరీల బాట

1 Aug, 2019 10:45 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు నిందితుడు ముకుందరావు

భాగ్యనగర్‌కాలనీ: మద్యానికి బానిసైన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతూ కటకటాల పాలైన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ సురేందర్‌ రావు, సీఐ లక్ష్మీ నారాయణ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కొత్త పొన్నుటూరు గ్రామానికి చెందిన ముకుందరావు  మూసాపేట జనతానగర్‌లో ఉంటూ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కళ్యాణి జనతానగర్‌లోనే ఉండేది. ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో వారి కుటుంబ విషయాలు ముకుందరావుకు తెలిసేవి.  బోయినపల్లిలో ఉంటున్న కళ్యాణి కుమార్తె పావని గతంలో తన నగలను వైజాగ్‌లో తాకట్టు పెట్టింది.  

ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న పావని భర్త ఈ నెల 18న నగరానికి వస్తున్నట్లు తెలియడంతో ఆమె వైజాగ్‌ వెళ్లి తన ఆభరణాలను విడిపించుకుని వచ్చి గత నెల 19న తన తల్లి వద్ద భద్రపరిచింది. ఈ నెల 23న బయటికి వెళుతున్న కళ్యాణి ఇంటికి తాళం వేసి తాళం చెవిని బాత్రూంలో దాచి పెట్టింది. అప్పటికే రెక్కీ నిర్వహిస్తున్న ముకుందరావు తాళం చెవి తీసుకొని ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 29 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిసిన వారిపనిగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ముకుందరావును  అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.  అతడి నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో  6 తులాలు ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు గుర్తించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు