పట్టుచీరల ముసుగులో మద్యం రవాణా

9 Jul, 2020 09:01 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న మద్యం

గుట్టు రట్టు చేసిన సెబ్‌ అధికారులు

కార్గో పార్శిల్‌  సర్వీస్‌లో హైదరాబాద్‌ నుంచి ధర్మవరానికి

రూ.1.61 లక్షల విలువ చేసే మద్యం,    టోబాకో పొడి స్వాధీనం

ఆరుగురిపై కేసు నమోదు.. ముగ్గురి పట్టివేత

ధర్మవరం అర్బన్‌: పార్శిల్‌ సర్వీస్‌ ముసుగులో గుట్టుచప్పడు కాకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును సెబ్‌ పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబ్‌ ఎఎస్పీ రామ్మోహన్‌రావు వెల్లడించారు.  హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి పట్టుచీరలు, చీరల పార్శిల్‌ బాక్స్‌లతో ఎస్‌బీఆర్‌ఎస్‌ కార్గో సర్వీస్‌కు చెందిన కేఏ07ఏ 2083 ఐచర్‌ వాహనం మంగళవారం రాత్రి బయలుదేరింది. 44వ జాతీయ రహదారి మీదుగా నేరుగా ధర్మవరానికి వస్తున్న ఆ వాహనాన్ని పలు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఆపి పరిశీలించారు. కార్గో పార్శిల్‌ సర్వీస్‌ వే బిల్లులు చూపుతూ.. పట్టుచీరలు, చీరలు తరలిస్తున్నట్లుగా అందులోని వ్యక్తులు చెబుతూ లైన్‌ క్లియరెన్స్‌ తీసుకుంటూ వచ్చారు. దీంతో ఎలాంటి అనుమానాలు ఆ వాహనాన్ని చెక్‌పోస్టుల వద్ద వదిలిపెడుతూ వచ్చారు. 

ముందస్తు సమాచారంతో..  
హైదరాబాద్‌ నుంచి భారీగా మద్యం బాటిళ్లను అక్రమంగా ధర్మవరానికి తరలిస్తున్నట్లుగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) ఏఎస్పీ రామ్మోహన్‌రావుకు సమాచారం అందింది. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసిన ఆయన... బుధవారం తెల్లవారుజామున ధర్మవరం సమీపంలోని వేల్పుమడుగు వద్ద కాపు కాశారు. వేగంగా దూసుకువస్తున్న ఐచర్‌ వాహనాన్ని గుర్తించి సెబ్‌ సీఐలు జయనాథరెడ్డి, నరసానాయుడు, భీమలింగ, ఎస్‌ఐలు చాంద్‌బాషా సాదిక్‌ వలీ అడ్డుకున్నారు. ఆ సమయంలో వాహనంలో ఉన్నవారు పోలీస్‌ అధికారులతో మాట్లాడుతూ.. ‘ఇది ఎస్‌బీఆర్‌ఎస్‌ పార్శిల్‌ వాహనమని, ఇందులో పట్టుచీరలు, చీరలు తప్ప మరేమీ లేవంటూ నమ్మబలికారు. అయితే తమకున్న పక్కా సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేసి తీరాల్సిందేనంటూ పోలీస్‌ అధికారులు పట్టుబట్టారు.  

నిందితులు వీరే..  
సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలో భాగంగా దశల వారీగా మద్యనిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం అమ్మకాలపై పలు రకాలుగా నిషేధం విధిస్తూ వచ్చింది. దీనికి తోడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగంగా మద్యం ఎక్కడా లభ్యం కావడం లేదు. దీనిని సొమ్ము చేసుకోవాలని భావించిన పలువురు అక్రమ మార్గాల ద్వారా అధిక ధరలకు మద్యం విక్రయించి తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని భావించారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టణానికి చెందిన చీరల వ్యాపారి కోనారెడ్డితోపాటు మరో ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి, హైదరాబాద్‌లో భారీగా మద్యం కొనుగోలు చేసి కార్గో పార్శిల్‌ సర్వీసు ద్వారా రాచమార్గంలో ధర్మవరానికి చేరుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సెబ్‌ ఎఎస్పీ రామోహ్మన్‌రావు పథకం ప్రకారం ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో కోనారెడ్డితో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు పట్టుబడ్డారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో అరెస్ట్‌ చేయబోతున్నట్లు సెబ్‌ ఏఎస్పీ పేర్కొన్నారు. మద్యం బాటిళ్లు, టోబాకో టిన్‌లతో పాటు ఐచర్‌ వాహనాన్ని సీజ్‌ చేసినట్లు వివరించారు. కాగా, మద్యం అక్రమ రవాణా గుట్టును రట్టు చేసిన సీఐలు, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుల్‌ శివప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్‌రెడ్డి, మారుతీప్రసాద్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.     

రూ. లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు.. 
పోలీస్‌ అధికారుల ఒత్తిడికి వాహనం  తలుపులు తీసి పట్లు చీరల బాక్స్‌లు చూపించారు. అయితే ఆ బాక్స్‌లు తెరవాలని పోలీసు అధికారులు ఆదేశించడంతో రాజీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినా పోలీస్‌ అధికారులు వినలేదు. చివరకు పోలీస్‌ అధికారులే బాక్స్‌లను తెరవాల్సి వచ్చింది. బాక్స్‌లు తెరిచిన తర్వాత పోలీసులే అవాక్కయ్యారు. అదులో ఏకంగా రూ.1.61 లక్షలు విలువ  చేసే మద్యం బాటిళ్లు, పొగాకు డబ్బాలు బయటపడ్డాయి.

మరిన్ని వార్తలు