కూలిన ఏఎన్‌- 32.. 13 మృతదేహాలు వెలికితీత

13 Jun, 2019 17:04 IST|Sakshi

ఈటానగర్‌ : అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిపోయిన ఏఎన్‌-32 విమాన ప్రమాద స్థలం నుంచి 13 మృతదేహాలను వెలికితీశారు. అలాగే కూలిపోయిన విమానం బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని లిపోకి 16 కిలోమీట‌ర్ల దూరంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 విమానం కూలిపోయిన విషయాన్ని ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విమానం శకలాలను  ఎంఐ-17 విమానాలు చేపట్టిన గాలింపు చర్యల్లో గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రమాద స్థలంలో మృతదేహాలను గుర్తించి మృతుల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు.

జూన్‌ 3న 13 మందితో బయలుదేరిన ఏఎన్‌32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాంలోని జొర్హాత్‌ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండాపోయింది.  విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో  ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. గల్లంతైన ఏఎన్‌32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది.

మరిన్ని వార్తలు