అన్నీ ప్రశ్నలే

26 Jan, 2018 11:15 IST|Sakshi
గుంటూరులో కిడ్నీ కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కిడ్నీ రాకెట్‌ కేసులో నిందితుల అరెస్టు చూపిన పోలీసులు

రెవెన్యూ అధికారుల పాత్రపై నోరుమెదపని వైనం

అసలు సూత్రధారులు తప్పించుకున్నట్లేనా ?

కిడ్నీ రాకెట్‌ కథ కంచికి చేరినట్టేనా ? కలుగులో ఉన్న సూత్రధారులను వదిలి పైకి కనిపిస్తున్న పాత్రధారులను నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా ? అనుమతి పత్రాలపై గుడ్డిగా సంతకాలు చేసిన రెవెన్యూ అధికారులను ఒడ్డున పడేస్తున్నారా ? 20 రోజుల విచారణలో ఎక్కడా వీరి ప్రస్తావన లేకపోవడానికి ఇదే కారణమా ? కిడ్నీ రాకెట్‌ కేసులో గురువారం నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చాక..ఇలా అనేక ప్రశ్నలు వారి వెనకే పోలీసుల తీరును వెక్కిరిస్తూ కనిపించాయి. ఈ వ్యవహారంలో ఇంకా వెలుగుచూడని     అక్రమాల చిట్టాలు సశేషంగానే మిగిలిపోయాయి.

సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నీ రాకెట్‌ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు వాటి మూలాలను కనిపెట్టలేకపోయారు. కిడ్నీ దానం చేసిన వ్యక్తులతోపాటు, అందుకు సహకరించిన దళారులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ల చుట్టూనే దర్యాప్తు సాగించారు. కానీ రెవెన్యూ అధికారులు, పెద్దల పాత్రపై ఆధారాలు సేకరించడంలో విఫలమయ్యారు.

బాధ్యత మీదంటే మీది..
పోలీసులు 20 రోజులపాటు దర్యాప్తు జరిపి నలుగురు నిందితులను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారుల పాత్రపై ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. పోలీసు దర్యాప్తులో రెవెన్యూ సిబ్బంది పాత్ర తేలితే వారే శిక్షిస్తారంటూ ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతుండటం గమనించదగ్గ విషయం.

రెండు నెలలు ఎందుకు దాచారు ?
గత ఏడాది నవంబరు 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దారు చెబుతున్నారు. అప్పటి నుంచి రెండు నెలల పాటు అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసు అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. వ్యవహారం బయటకు రావడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు హడావుడి చర్యలకు పూనుకున్నారు. అసలు ఈ రెండు నెలల కాలం పోలీసులు ఏమి చేసినట్లు ? ఎందుకు కేసు విషయాన్ని బయటకు చెప్పలేదు ? అప్పట్లో ఎవరెవరిని విచారణ చేశారు ? గుడ్డిగా అనుమతుల పత్రంపై సంతకం చేసినందుకు తహసీల్దార్‌ను ఎందుకు ప్రశ్నించ లేదు ? వీటన్నింటికీ సమాధానం లేదు.

ముందుగా డీల్‌ కుదిరిందా ?
దుర్గి మండలం చంద్రకుంట తండాకు చెందిన వెంకటేశ్వరనాయక్‌ ఆధార్‌ కార్డును మార్ఫింగ్‌ చేసి అందులో రావూరి రవి పేరు, అడ్రస్‌ పెట్టారు. ముందుగా రెవెన్యూ అధికారులతో బేరం మాట్లాడుకున్న తరువాత మాత్రమే ఈ వ్యవహారం నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రావూరి రవి పేరుతో దరఖాస్తు చేసిన వెంకటేశ్వర నాయక్‌ పదేళ్లుగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు వీఆర్వో, తహసీల్దారు, ఆర్డీవోలు ధ్రువీకరించారు.

ఓ పోలీసు అధికారి మధ్యవర్తిత్వమే కారణమా ?
వీఆర్వోకు దగ్గరి బంధువు అయిన ఓ పోలీసు అధికారి మధ్యవర్తిత్వం వహించి అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు ఇబ్బంది లేకుండా దర్యాప్తు చేయించారని సమాచారం. అధికార పార్టీ నేతలతో బలమైన సంబంధాలు ఉన్న కొందరు రెవెన్యూ అధికారులు తమపై చర్యలు లేకుండా చూడాలంటూ వారిని ఆశ్రయించినట్లు తెలిసింది. కిడ్నీ మార్పిడి ఏ విధంగా అనుమతి ఇస్తారు ? అనుమతులు తీసుకున్న తరువాత అదే వ్యక్తి కిడ్నీ దానం చేస్తున్నాడా ? లేదా ? మనుషులను మార్చేస్తున్నారా ? అనే దానిపై అటు వైద్య అధికారులుగానీ, పోలీసు అధికారులు గానీ దృష్టి సారించలేదు.  

మరిన్ని వార్తలు