కేశనకుర్రుపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

20 Apr, 2018 11:58 IST|Sakshi
స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుచ్చిబాబు, వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ పొన్నాడ సతీష్‌ 

ధర్నాకు దిగిన దళిత సంఘాలు

దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ 

ఐ.పోలవరం : గుర్తుతెలియని దుండగులు కేశనకుర్రుపాలెం సంత మార్కెట్‌ సెంటర్‌లో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడినట్టు గురువారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మండలంలోని దళిత నేతలకు, ప్రజలకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పెద్ద ఎత్తులో చేరుకున్న దళిత నాయకులు రహదారులపై బైఠాయించి ధర్నా చేశారు.  

అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, విగ్రహం ఉన్న స్థానే నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, ఈ స్థలానికి పంచాయతీ తీర్మానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సంఘటన స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించి దళిత సంఘాల నేతలతో చర్యలు జరిపారు. దోషులను త్వరిత గతిన పట్టుకోవాలని పోలీసులకు సూచించారు.

ధ్వంసమైన విగ్రహం స్థానే పంచాయతీ తీర్మానం చేసి కాంస్య విగ్రహం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పొన్నాడ సతీష్‌కుమార్, భూపతిరాజు సుదర్శనబాబు, మండల కన్వీనర్‌ పిన్నంరాజు వెంకటపతిరాజు తదితరులు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పొన్నాడ మాట్లాడుతూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని, విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ ఆందోళనలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ జిల్లా అధ్యక్షుడు రేవు అప్పలస్వామి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కాశి శ్రీహరి, కాశి పరివాజ్‌ కుమార్, జనిపెల్ల విప్లవ్‌కుమార్, మోకా రవి, దుక్కిపాటి సత్యనారాయణ, ఎం.టి.ప్రసాద్, తదితరులు ఉన్నారు.

డీఎస్పీ విచారణ

అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని అమలాపురం డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌ పరిశీలించి, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. జాగిలాలు కిలోమీటరు దూరంలో ఉన్న జైభీమ్‌ నగర్‌లో ఒక బావి వద్ద ఆగిపోయాయి. డీఎస్పీ మాట్లాడుతూ దోషులను తొందర్లోనే గుర్తిస్తామన్నారు. ఈయన వెంట అమలాపురం రూరల్‌ సీఐ దేవకుమార్, ఎస్సైలు ప్రభాకరావు, క్రాంతి కుమార్, దుర్గా  శేఖర్‌రెడ్డి, భారీస్దాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు పంచాయతీ తీర్మానం చేయాలని చెప్పడంతో గురువారం మధ్యాహ్నం పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనిపై సరైన స్పష్టత రాకపోవడంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆందోళన చేస్తున్న దళిత సంఘాలతో రాత్రి ఎమ్మెల్యే బుచ్చిబాబు చర్చలు జరిపారు. తనసొంత ఖర్చులతో శుక్రవారం విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే దోషులను  కఠినంగా శిక్షించేందుకు హామీ ఇచ్చారు. దీంతో  దళిత సంఘాలు ఆందోళను తాత్కాలికంగా నిలిపివేశాయి. 

మరిన్ని వార్తలు