అనంత ఫ్యాక్షన్‌.. నలుగురికి యావజ్జీవం

3 Mar, 2020 13:43 IST|Sakshi

సాక్షి, అనంతపురం : తిప్పేపల్లి ఫ్యాక్షన్‌ హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్‌ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కర్నూలు సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు పూర్వాపరాలు ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు ఇలా ఉన్నాయి. ధర్మవరం రూరల్‌ మండలం తిప్పేపల్లిలో దేవరపల్లి వర్గం, ముక్తాపురం వర్గం నడుమ దశాబ్దాల తరబడి ఫ్యాక్షన్‌ గొడవలున్నాయి. కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేవరపల్లి వర్గానికి దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి, ముక్తాపురం వర్గానికి ముక్తాపురం రామకృష్ణారెడ్డి (70) నాయకత్వం వహించేవారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం తిప్పేపల్లి కాగా అనంతపురంలో సంపూర్ణ లాడ్జి నడుపుతున్నాడు. వీరిద్దరి నడుమ వర్గపోరుతో పాటు రాజకీయ విభేదాలు ఉన్నాయి.  

తిప్పేపల్లి నుంచి సంగాలకు రోడ్డు మార్గం దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి తోటలోంచి వెళ్లే ప్రతిపాదన ఏడేళ్ల కిందట వచ్చింది. అయితే రోడ్డు వేయకుండా లక్ష్మినారాయణరెడ్డి జిల్లా కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకొచ్చేవాడు. ఇది ముక్తాపురం వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదను చూసి హత్యకు కుట్రపన్నారు. 2013 ఏప్రిల్‌ 12 నుంచి మొదలుపెట్టి పలు దఫాలు లక్ష్మినారాయణరెడ్డిని హత్య చేయటానికి పన్నాగం పన్నారు. లక్ష్మినారాయణరెడ్డి తోటలోనే మారణాయుధాలు దాచివుంచి అదను కోసం వేచి ఉన్నారు. చదవండి: జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్‌

ఎట్టకేలకు మే 5వ తేదీన లక్ష్మినారాయణరెడ్డి ఒంటరిగా బైక్‌ మీద వస్తున్న విషయం తెలిసి అతను ఇంకా బండి దిగకమునుపే దాడిచేసి హతమార్చారు. అటునుంచి మారణాయుధాలను వెంకటరెడ్డి పొలంలో పారవేసి శివలింగారెడ్డి ఇంటికి చేరారు. హత్యజరిగిన వెంటనే ప్రత్యక్షసాక్షిగా హతుడి భార్య దేవరపల్లి రామకృష్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం రూరల్‌ పోలీసులు తిప్పేపల్లికి చెందిన ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై కేసు నమోదు చేశారు.  

ఫ్యాక్షన్‌ కేసు కావటంతో సీఐడీ పోలీసులు రంగంలో దిగారు. దర్యాప్తు అనంతరం ఆ నలుగురితో పాటు కసిరెడ్డి రాజారెడ్డి, తిప్పేపల్లికి చెంది, అనంతపురంలో సంపూర్ణలాడ్జి నడుపుతున్న ముక్తాపురం రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో స్థిరపడిన ముక్తాపురం అనిల్‌కుమార్‌రెడ్డి, బత్తలపల్లి మండలం సంగాలకు చెందిన కొడకండ్ల నరసింహారెడ్డి, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన గొర్ల వెంకటలింగారెడ్డి, గొర్ల రామలింగారెడ్డి, తాడిమర్రి మండలం ఆత్మకూరుకు చెందిన  పొడెమల ఓబిరెడ్డి, వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం ఎగువ పల్లికి చెందిన శివలింగారెడ్డిలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

తొలుత ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై సాక్ష్యాధారాలు నిరూపణ కావటంతో ఆ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి బి.సునీత తీర్పు చెప్పారు. మిగిలినవారిపై నేరారోపణలు రుజువుకాక పోవటంతో నిర్దోషులుగా విడుదల చేశారు. దర్యాప్తు అధికారిగా సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్‌ ఉపేంద్రబాబు వ్యవహరించగా, కోర్టులో సాకు‡్ష్యల హాజరుకు సహకరించిన కోర్టు కానిస్టేబుళ్లు బత్తలపల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన రామాంజి, సీబీసీఐడీకి చెందిన జాఫర్‌షావలిని పోలీసు అధికారులు అభినందించారు.  చదవండి: తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం

మరిన్ని వార్తలు