ఇల్లరికం ఇష్టం లేక.. 

12 Dec, 2019 03:21 IST|Sakshi

భార్యతో సహా కొడుకునూ హత్య చేసిన అనంతప్ప 

విద్యుత్‌ వైర్‌ పట్టుకొని తనూ ఆత్మహత్యాయత్నం 

గచ్చిబౌలి: ఇల్లరికం ఇష్టం లేక ఓ వ్యక్తి.. భార్య, కొడుకును గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. తమ వంశం అత్తవారికి మిగలవద్దనే ఇద్దరినీ హత్య చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కర్నాటక రాంపూర్‌ యాద్గిరి జిల్లాకు చెందిన అనంతప్ప (25) అలియాస్‌ చిన్నాకు తన మేనత్త కూతురు మహాదేవి(22)తో పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. అనంతప్ప మేనత్తకు నలుగురూ కూతుర్లే కావడంతో అతన్ని ఇల్లరికం తీసుకునేందుకు అప్పట్లో మాట్లాడుకున్నారు. ఏడాది క్రితం మహాదేవి, కూతురు అర్చన(3), కొడుకు ఆకాష్‌(18 నెలలు)తో కలసి గౌలిదొడ్డికి వచ్చాడు. పెద్ద కూతురు అనురాధ అమ్మమ్మ వద్ద ఉంటోంది. బుధవారం ఉదయం 5.30 సమయంలో నిద్రిస్తున్న భార్య మహాదేవి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.

ఈ సమయంలో భార్య చేయి ఆకాష్‌ గొంతుపై ఉంది. ఆ చేయిపై మోకాలు పెట్టి అదమడంతో ఆకాష్‌ గొంతుకు చేయి బిగుసుకుని చనిపోయాడు. ఆడపిల్లలు వంశం మోయలేరన్న భావనతో కూతురు అర్చనను ఏమి అనలేదు. ఉదయం 7.30 గంటల సమయంలో బెంగళూర్‌లో ఉండే స్నేహితుడు శ్రీశైలంకు ఫోన్‌ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. విద్యుత్‌ వైర్లను ఎడమ చేతి వేళ్లకు చుట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ లోపు శ్రీశైలం విషయాన్ని నానక్‌రాంగూడలో ఉండే అనంతప్ప అన్న కొడుకు చెన్నప్పకు తెలిపాడు. 8 గంటల సమయంలో అతను వచ్చి చూడగా అనంతప్ప అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతప్ప ఆత్మహత్యాయత్నం చేసిన కొద్ది క్షణాల్లోనే ట్రిప్‌ కావడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో బతికాడు. నిందితుడు గచ్చిబౌలిలోని ఓ ప్రైయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహాదేవి, ఆకాష్‌ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తరచుగా గొడవలు: అనంతప్ప మాట్లాడుతూ.. మహాదేవికి వాళ్ల కుల దేవత దేవమ్మ అంటే ఇష్టమని, పూజల విషయంలో ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవన్నాడు. వనిగిరి రావాలని అత్తింటి వారు ఒత్తిడి చేస్తున్నారని, ఇల్లరికం ఇష్టం లేకే భార్య, కొడుకును హత్యచేశానని చెప్పాడు. వచ్చే వారం అత్తింట్లో కుల దేవత పండగ ఉందని చెప్పడంతో బుధవారం ఉదయం పోదామని భార్యతో చెప్పినట్లు వివరించాడు. మంగళవారం సాయంత్రమే భార్య, కొడుకును చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు