ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్‌ ఫీల్డ్‌ అధికారి అరెస్ట్‌

24 Mar, 2018 11:20 IST|Sakshi
అరెస్టు అయిన చేబ్రోలు పాండురంగాచార్యులు

నకిలీ పత్రాలతో రూ.కోటి మేర రుణాలు ఇప్పించి పరారీ

ఆకివీడు: నకిలీ ధ్రువపత్రాలతో రూ.కోటి మేర రుణాలు ఇప్పించి అనంతరం ఉద్యోగ విరమణ చేసి  పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఆంధ్రాబ్యాంక్‌ రిటైర్డ్‌ ఫీల్డ్‌ అధికారి చేబ్రోలు పాండురంగాచార్యులును శుక్రవారం భీమవరం రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాండురంగాచార్యులు 2007–10 మధ్య కాలంలో ఆకివీడుకు చెందిన కూన సత్యనారాయణ అనే వ్యక్తికి నకిలీ ధ్రువపత్రాల ద్వారా రూ.కోటి పైనే రుణాలు అందజేశాడు. అప్పట్లోనే దీనిని గుర్తించి బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సత్యనారాయణను అరెస్టు చేశారు. అయితే పాండురంగాచార్యులు ఉద్యోగ విరమణ అనంతరం  తప్పించుకుని హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. శుక్రవారం భీమవరంలోమేనల్లుడి వివాహానికి హాజరైన పాండురంగాచార్యులును భీమవరం రూరల్‌ సీఐ ఎస్‌.ఎస్‌.వి.నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతనిని శనివారం కోర్టులో హాజరుపరుస్తామని ఆకివీడు ఎస్సై కె.సుధాకరరెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు