ఏ బ్యాంకులో ఏముందో?

1 Nov, 2019 09:50 IST|Sakshi

అసలు ఏదో? నకిలీ ఏదో!

బంగారు ఆభరణాల తాకట్టులో కనికట్టు

యాదమరి అప్రైజర్‌ ఘనకార్యంతో అనుమానం

బ్యాంకుల నిర్లక్ష్యంతో ప్రజాధనం పక్కదారి

త్వరలోనే సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహిస్తాం : ఎస్పీ

చిత్తూరు అర్బన్‌: బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవడం ఆనవాయితీ. బ్యాంకుకు రుణం తీసుకునే వ్యక్తికి మధ్యలో ఆభరణాల విలువ నిర్ధారకుడు కీలకం. అతడే అప్రైజర్‌. కుదువ పెట్టేందుకు తెచ్చిన ఆభరణాల నాణ్యతలో అప్రైజర్‌ ఏం చెబితే అదే వేదం. బ్యాంకులో ఇంటర్నల్‌ ఆడిట్, విజిలెన్స్‌ విభాగాలున్నా కూడా కిలోల కొద్దీ ఉన్నా ఆభరణాలు అసలైనవా..? గిల్టువా..? నాణ్యతలో ఎన్ని క్యారెట్లు ఉన్నాయి..? అనే విషయాలను గుర్తించడంలో కొందరు బ్యాంకు అధికారులతో పాటు బంగారం కుదువపెట్టి రుణాలు ఇచ్చే ప్రైవేటు సంస్థలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. యాదమరి మండలంలోని మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు ఘటనలో వెలుగుచూసిన వాస్తవాలు అసలు జిల్లాలో బ్యాంకుల్లో కుదువపెట్టిన నగలు అసలైనవా, నకిలీవా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 

నిద్దరోతున్న నిఘా..
జిల్లాలో 39 ప్రధాన బ్యాంకులు, 616 ఉప శాఖలు ఉన్నాయి. వీటిలో దాదాపు 40 లక్షల మంది ఖాతాదారులున్నారు. సగటున 60 శాతం మంది బ్యాంకుల నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నారు. ఏటా రూ.వంద కోట్ల వరకు బంగారు ఆభరణాలపై లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ఆభరణాల నాణ్యతను పరిశీలించడంతో పాటు వాటి విలువ లెక్కించడానికి విజిలెన్స్, ఆడిట్‌ పేరిట తనిఖీలు నిర్వహించాలి. కానీ కొన్ని జాతీయ బ్యాంకుల్లో ఇవి తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ఆడిట్‌కు వచ్చే బృందంలో కూడా అప్రైజర్లదే కీలకపాత్ర. వారు ఆభరణాలు పరిశీలించి అవన్నీ అసలైననవే అని చెబితే ఆ మాటనమ్మి విజిలెన్స్‌ బృందాలు వెనక్కు వచ్చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం చేతివేళ్లపై అందుబాటులో ఉన్నా కూడా బంగారం నాణ్యతను పరిశీలించడంలో బ్యాంకులు మూస పద్ధతినే ఉపయోగిస్తున్నాయి. ఇక కొన్ని బ్యాంకుల ఏటీఏం కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డులను ఉంచకపోవడం, లోపలున్న సీసీ కెమెరాలు పనిచేయడపోవడం, కొన్ని పనిచేసినా అందులోని దృశ్యాలు అస్పష్టతగా ఉండడం బ్యాంకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.  

ఒకే అప్రైజర్‌తో పనులు
మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకులో పనిచేసిన అప్రైజర్‌ రమేష్‌.. చిత్తూరులోని మరో ఆంధ్రాబ్యాంకుకు సైతం అప్రైజర్‌గా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమైనా గిల్టు నగలు తాకట్టుపెట్టి రుణాలు పొందాడా..? అని బ్యాంకు అధికారులను అడిగితే తెల్లమొహాలు వేస్తున్నారు. పైగా థర్డ్‌పార్టీ ఆడిట్‌కు వెళ్లేప్పుడు పలు బ్యాంకులకు ప్రధాన అప్రైజర్‌ స్థాయిలో తనిఖీలుచేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు కంటే ఎక్కువ సం ఖ్యలో శాఖలను కలిగి ఉన్న కొన్ని బ్యాంకులు ఒకే వ్యక్తిని అప్రైజర్‌గా నియమించుకుంటున్నాయి. పైగా ఎంపిక సమయంలో అతని గురించి వాకబు చేయకపోవడం, కనీసం పోలీసుల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ కూడా అడగకపోవడం ఇక్కడి జవాబుదారితనాన్ని ప్రశ్నిస్తోంది. మాల్యా, నీరవ్‌ మోదీ లాంటి మహా మోసగాళ్లకు రూ.వేల కోట్లలో రుణాలు ఇచ్చి, ఓ సామాన్య రైతు రూ.లక్ష రుణం అడిగితే మాత్రం లక్ష యక్ష ప్రశ్నలు వేసే బ్యాంకర్లు బంగారు ఆభరణాలపై రుణాల విషయంలో కూడా ఇదే ఉదాతీనత ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

సెక్యూరిటీ ఆడిట్‌
బ్యాంకులో పరిస్థితిపై లీడ్‌బ్యాంక్‌ మేనేజరుతో కలిసి అన్ని బ్యాంకుల మేనేజర్లతో మరో రెండు రోజుల్లో సమావేశం నిర్వహిస్తాం. సెక్యూరిటీ ఆడిట్‌ పేరిట బ్యాంకుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏటీఎం కేంద్రాల్లో ఉండాల్సిన కెమెరాల నాణ్యత ఇతర విషయాలపై ఇక్కడ చర్చిస్తాం. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటంపై సమీక్షిస్తాం.  – సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు 

బ్యాంకులు చూడ మేలిమై యుండు
పొట్లాలు విప్పి చూడ పసిడి నగలుయుండు
అసలు నగలేవో.. నకిలీ నగలేవో తెలియకుండు
ప్రజల సొమ్ముతో జల్సాలేరా రామా..!
ప్రస్తుతం జిల్లాలో బ్యాంకుల పరిస్థితి ఇలాగే తయారయ్యింది. 

జిల్లాలో బ్యాంకుల గణాంకాలు
జాతీయ బ్యాంకులు     370
గ్రామీణ బ్యాంకులు      133
సహకార బ్యాంకులు    31
ఇతర బ్యాంకులు         82
ఖాతాదారులు            40 లక్షల మంది
బంగారు రుణగ్రస్తులు    24 లక్షల మంది
ఏటా లావాదేవీలు       రూ.100 కోట్లు 

మరిన్ని వార్తలు