పచ్చ మారాజుల 'వన్య' భోజనం

3 Jul, 2018 12:08 IST|Sakshi
వన్యప్రాణుల మాంసాన్ని హెరిటేజ్‌ ఫ్రీజర్‌ బాక్స్‌లో పెట్టి స్కార్ఫియో వాహనంలో తరలిస్తున్న దృశ్యం, ఫ్రీజర్‌ బాక్స్‌లో దొరికిన వన్యప్రాణుల మాంసం మూటలు

యథేచ్ఛగా వన్యప్రాణుల వేట

వాటి మాంసంతో ప్రముఖులకు విందులు

కథ అడ్డం తిరిగి మాంసంతో దొరికిపోయిన నిందితులు

హెరిటేజ్‌ ఫ్రీజర్‌ బాక్సులో తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

ప్రధాన నిందితుడు మంత్రి యనమలకు సన్నిహితుడు

ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో టీడీపీ నేతల వేట

మృగయా వినోదం పేరిట వన్యప్రాణుల వేట.. వాటి మాంసంతో విందు వినోదాలు ఒకనాడు హోదాకు చిహ్నాలు..నేటి సమాజంలో వన్యప్రాణుల వేట ఓ నేరం.. కానీ కొందరు బడాబాబులు తమ హోదాను చాటుకునేందుకు ఇదే దుస్సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు..వన్యప్రాణుల మాంసంతో మంత్రులు, ఇతర ప్రముఖులను ఖుషీ చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ అమాత్యుడి ముఖ్య అనుచరుడి కుటుంబ ఫంక్షన్‌ కోసం.. ఇలా వన్యప్రాణుల మాంసాన్ని తరలించడం.. ఈ ప్రాంతంలో పాతుకుపోయిన ఈ దుస్సంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చింది.

విడ్డూరమేంటంటే.. వన్యప్రాణుల మాంసాన్ని సీఎం కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థ ప్రీజర్‌ బాక్స్‌లో తరలించడం..!

అయితే కథ అడ్డం తిరిగి.. అడ్డగోలుగా తరలిస్తున్న ఈ మాంసం నిల్వలు అటవీ అధికారులకు దొరికిపోవడం.. వారి విచారణలో కఠోర వాస్తవాలు వెలుగు చూస్తుండటం కలకలం రేపుతోంది. పాయకరావుపేట దుర్గాకాలనీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున హెరిటేజ్‌ ప్రీజర్‌ బాక్స్‌లో పెట్టి స్కార్ఫియో వాహనంలో తరలిస్తున్న మూడు సంచుల వన్యప్రాణుల మాంసంతో పాటు కణుజు తోలు, కాళ్లు పట్టుబడిన కేసులో నిందితులంతా టీడీపీ నేతలే..మంత్రి యనమల రామకృష్ణుడికి సన్నిహితుడైన తుని మండలం సీతారామపురం గ్రామానికి చెందిన నెట్టి కృష్ణంరాజు కుటుంబ ఫంక్షన్‌ కోసమే ఈ మాంసాన్ని తరలిస్తున్నట్టు పట్టుబడిన వారు చెప్పడంతో పరారీలో ఉన్న కృష్ణంరాజును ఏ–1గా పెట్టి కేసు నమోదు చేశారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాయకరావుపేట తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో ఆదివారం ముగ్గురు వ్యక్తుల నుంచి సుమారు 70 కిలోల వన్యప్రాణుల మాంసాన్ని యలమంచిలి అటవీ శాఖ రేంజర్‌ రవిప్రసాద్‌ ఆధ్వర్యంలోని బృందం స్వాధీనం  చేసుకుంది. వన్యప్రాణులైన కణుజు, అడవి పంది, అడవి గొర్రెలను చంపి.. ఆ మాంసాన్ని సీఎం చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫ్రీజర్‌ బాక్సులో తరలించడం కలకలం రేపింది. మంత్రి యనమల రామకృష్ణుడికి సన్నిహితుడైన తుని మండలం సీతారామపురం గ్రామానికి చెందిన నెట్టి కృష్ణంరాజుకు చెందిన కుటుంబ ఫంక్షన్‌ కోసమే ఈ మాంసాన్ని తరలిస్తున్నట్టు అటవీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు నిందితులు చెప్పుకొచ్చారు. వారి విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటికొస్తున్నాయి. చక్కెర కర్మాగారం వెనుక కూత వేటు దూరంలో ఉన్న తోటల్లో పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరం ప్రాంతానికి చెందిన ఓ భూస్వామికి గెస్ట్‌ హౌస్‌ ఉంది. ఇక్కడే ఆదివారం భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరయ్యే ప్రముఖులకు వడ్డించేందుకు మూడు రకాల వన్యప్రాణులను వేటాడినట్లు సమాచారం.

అక్కడే వేటాడారా?
కోటవురట్ల మండలం పందూరు, అల్లుమియ్యపాలెం ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడి.. మాంసాన్ని వాహనంలో విందు వేదిక వద్దకు తరలిస్తూ దొరికిపోయారు. టీడీపీలోని రెండు వర్గాల మధ్య  ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఓ వర్గం నేతలు జిల్లా అటవీ అధికారులకు ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట జరుగుతున్నప్పటికీ ఏనాడు వీటివైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు ఇప్పుడు మాటు వేసి పట్టుకోవడానికి టీడీపీలని ప్రత్యర్ధి వర్గీయులు చేసిన పక్కా ఫిర్యాదే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్నో ఏళ్లుగా ఇదే తంతు
కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజుపై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఫైనాన్స్‌ వ్యాపారం చేసే కృష్ణంరాజుకు ఇటువంటి విందుల నిర్వహణలో సిద్ధహస్తుడిగా పేరుంది. ఆదివారం మాంసాన్ని తరలిస్తూ పట్టుబడ్డ వాహనం(స్కార్పియో వాహనం నెం:ఎపి.35డి.5678) కూడా ఆయనదే కావడం గమనార్హం.  కాగా,  మారుమూల తోటలో ఉన్న గెస్ట్‌ హౌస్‌లో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు స్థానికంగా ఉన్న చోటా మోటా నాయకులకు వన్యప్రాణుల మాంసంతో విందు ఇచ్చే తంతు చాలా ఏళ్ల నుంచి నడుస్తోందని అంటున్నారు. రెండు నెలల కిందట తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన మంత్రికి ఇదే గెస్ట్‌హౌస్‌లో లంచ్‌ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మారుమూల గెస్ట్‌ హౌస్‌కు, ఇక్కడి తోటల్లో జరిగే పంక్షన్లకు మంత్రులు పదే పదే రావడం వెనుక మర్మం ఇదేనని అంటున్నారు.

సెలవులో డీఎఫ్‌వో?
వాస్తవానికి జిల్లా అటవీశాఖాధికారి(డీఎఫ్‌వో) సెల్వంకు వచ్చిన సమాచారంతోనే యలమంచిలి అటవీరేంజ్‌ అధికారులు ఆదివారం ఉదయం దాడులు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి  డీఎఫ్‌వో  ఆ కేసు గురించి మాట్లాడేందుకు సుముఖత చూపడం లేదు. దాని గురించి అడిగినవారికి సోమవారం నుంచి సెలవులో ఉన్నానని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే  డీఎఫ్‌వో ఆ కేసు విషయంలో ఎవరితోనూ మాట్లాడటం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

హెరిటేజ్‌ ఫ్రిజ్‌ ఎక్కడిది?
వన్యప్రాణుల మాంసాన్ని హెరిటేజ్‌ ఫ్రిజ్‌లో తరలించడం కూడా చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపారసంస్థకు చెందిన ఫ్రీజర్‌ బాక్సులో తరలిస్తే  అధికారులెవ్వరూ తనిఖీ చేయరన్న ధైర్యంతోనే నిందితులు దాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. తునిలో ఓ టీడీపీ నేతకు చెందిన సాయిరామ్‌ పార్లర్‌  నుంచి  కూల్‌డ్రింక్‌లు భద్రపరిచేందుకు ప్రిజ్‌ కావాలని అడిగి మాంసం తరలించేందుకు ఉపయోగించినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవానికి సదరు సాయిరామ్‌ పార్లర్‌కు హెరిటేజ్‌ డీలర్‌షిప్‌ రద్దు అయినట్టు తెలుస్తోంది. రూ.6వేల రూపాయల బకాయి పడిన సాయిరామ్‌ పార్లర్‌ యజమాని హెరిటేజ్‌ డీలర్‌షిప్‌ను వదిలేసినట్లు సమాచారం. అలా డీలర్‌షిప్‌ వదిలేసిన తర్వాత ఫ్రిజ్‌ను తీసుకువెళ్ళకుండా హెరిటేజ్‌ సంస్థ ఎందుకు వదిలేసిందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. డీలర్‌షిప్‌ రద్దయిన తర్వాత బాక్స్‌లపై హెరిటేజ్‌ స్టిక్కర్‌ను తీసివేసే ఆనవాయితీ ఉందని, అయినా సరే అలా ఎందుకు వదిలేశారన్నది కూడా అనుమానంగానే ఉంది.

ఆ ముగ్గురికీ రిమాండ్‌
యలమంచిలి: వన్యప్రాణుల మాంసాన్ని తరలిస్తూ దొరికిపోయిన నిందితులు తుని మండలం మర్లపాడు గ్రామానికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్, సీతారామపురం గ్రామానికి చెందిన కోలా సత్యశివలోక్‌నా«థ్, కె.నవీన్‌కుమార్‌లను సోమవారం యలమంచిలి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ రెండు వారాల పాటు రిమాండ్‌ విధించారు.

ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ– ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రవిప్రసాద్‌
వన్యప్రాణుల వేట, మాంసం తరలింపు కేసులో ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేస్తామని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ చుక్కల రవిప్రసాద్‌ చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణంరాజు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని చెప్పారు. తాండవ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలోని గెస్ట్‌ హౌస్‌లో జరిగే విందులపై ఇకపై దృష్టి పెడతామని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు